ఆంధ్రప్రదేశ్‌లోని భూ యజమానులకు ఇచ్చే పట్టాదారు పాసు పుస్తకాలను ఇకపై రాజముద్రతో పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో రెవెన్యూశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటోతో పాసుపుస్తకాలను ముద్రించారు. అయితే తాము అధికారంలోకి వస్తే రాజముద్రతో పాసుపుస్తకాలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హామీ ఇచ్చిన విధంగా రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే రూపొందించిన ఓ పట్టాదారు పాసు పుస్తకాన్ని సీఎం చంద్రబాబుకు రెవెన్యూ శాఖ అధికారులు చూపించారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆస్తి వివరాలతో పాటుగా ఆ భూమికి ఎలా వెళ్లాలో దారి కూడా చూపేలా అధికారులు ఈ పట్టాదారు పాసుపుస్తకాన్ని తయారు చేశారు. అలాగే రాజముద్రతో దీనిని రూపొందించారు. దీనిపై చంద్రబాబు కూడా కొన్ని సలహాలు ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు చంద్రబాబు చేసిన సమీక్ష వివరాలను మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో వెల్లడించారు. పాసు పుస్తకాల్లో వైఎస్ జగన్ ఫోటో ఎందుకు వేశారో అర్థం కాలేదన్న మంత్రి.. ఇకపై రాజముద్రతో పాసుపుస్తకాలు ఇస్తామని వెల్లడించారు. ఇక గుజరాత్‌లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీద అధ్యయనం చేసి ప్రజలకు మేలు చేసేలా ఏపీలో ఆ చట్టాన్ని రూపొందిస్తామన్నారు.
మరోవైపు రీ సర్వే పేరుతో భూముల సర్వేకి వైసీపీ ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసిందని మంత్రి ఆరోపించారు. సరిహద్దు రాళ్లపై వైఎస్ జగన్ బొమ్మల కోసం ఏకంగా రూ.650 కోట్లు ఖర్చుచేశారని ఆరోపించారు. 78 లక్షల రాళ్లపై మాజీ సీఎం బొమ్మలు తీయాలంటే రూ.15కోట్లు ఖర్చవుతుందన్న మంత్రి.. వాటిని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. ఇక జిల్లాల వారీగా ఏ మేరకు భూములు అన్యాక్రాంతం అయ్యాయో లెక్కలు తీయాలని చంద్రబాబు ఆదేశించారని.. రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ పి సిసోడియా, సిసిఎల్ఎను ఆయా జిల్లాల్లో పర్యటించాలని చెప్పారన్నారు. 22ఏ నుంచి ఫ్రీహోల్డ్ అయిన భూమిని రిజిస్ట్రేషన్ల దగ్గర మరోసారి పరిశీలించి.. నిజమైన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో తేల్చాలని చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి చెప్పారు.