నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలోని ఓ వేపచెట్టుకు పాలు ధారలా కారుతున్నాయి. ఈ విషయం స్థానికంగా తెలియడంతో ఆ వింతను చూసేందుకు ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. వేప చెట్టుపై నుంచి విరామ లేకుండా ధారగా తెల్లటి ద్రవం కారుతుండటంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ విషయం తెలియడంతో చుట్టుపక్కల గ్రామల నుంచి కూడా అనేక మంది వచ్చి ఆ వేపచెట్టుకు వస్తున్న పాలను చూస్తున్నారు.
ఇలా వేప చెట్టుకు పాలు రావడం దేవుడి మహిమ అంటూ.. కొంతమంది మహిళలు ఆ చెట్టుకు పూజలు నిర్వహించారు. అయితే మరికొందరు ఆ పాలను కవర్లలో నింపుకుని తీసుకెళ్తున్నారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారంటూ ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుకుంటున్నారు. ఈ విషయాన్ని నాస్తికులు మాత్రం కొట్టిపారేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా భూమిలో కెమికల్ రియాక్షన్ జరుగుతుందని.. అందుకే ఇలా వేపచెట్టు నుంచి తెల్లటి ద్రవం కారుతూ ఉండొచ్చని.. దీన్ని దైవ మహిమగా భావించడం మూర్ఖత్వమని అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి.
పల్లెటూరు కావడంతో ఈ విషయం తెలియక అందరూ విచిత్రమని చూసేందుకు ఇలా వస్తున్నారని చెబుతున్నారు.
శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద నీరు
శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఎగువన భారీ వర్షాలు పడటంతో అటు తుంగభద్ర, ఇటు కృష్ణా నదులు ఉప్పొంగుతున్నాయి. భారీగా వరద నీరు వస్తుండటంతో జలాశయం అధికారులు అలర్ట్ అయ్యారు.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి శ్రీశైలానికి 4,41,222 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలంలో 873.40 అడుగులకు చేరడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్దమయ్యారు. ఇవాళ సాయంత్రం మంత్రి నిమ్మల రామానాయుడు గేట్లు ఓపెన్ చేసి నీళ్లను కిందుకు వదలనున్నారు. కర్నూలు జిల్లాలో తుంగభద్ర జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టుకు ఆదివారం 1,49,300 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా.. సుమారు 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ జలాశయంలో 1,631 అడుగులకుగాను 97.87 టీఎంసీల నీటి నిల్వ ఉంది.