రాజకీయాలను ఎన్నికల వరకే పరిమితం చేస్తూ పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ విధానమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సోమవారం మెంటాడ స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొన్నారు. జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ శాఖ అలసత్వం వల్ల ఇటీవల జరిగిన ప్రాణనష్టంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. పంచాయతీలు ఆర్థిక పరిపుష్టతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సంధ్యారాణి స్పష్టం చేశారు. హైవే పనుల వల్ల మండలంలోని కొన్ని రహదారులు దెబ్బతింటున్నాయని ఆర్‌అండ్‌బీ అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తాను మాట్లాడతానని సంధ్యారాణి హామీ ఇచ్చారు. జడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం ప్రజా సమస్యలపై దృష్టి సారించాలన్నారు. విధి నిర్వహణలో ఉదాసీనతను ఉపేక్షించబోమన్నారు. మంత్రితో పాటు జడ్పీ చైర్మన్‌ను ఈసందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సత్కరించారు. అనంతరం మంత్రి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అసంపూర్తిగా ఉన్న గుర్ల గెడ్డ మినీ రిజర్వాయర్‌కు నిధులు మంజూరు చేయాలని రైతు సంఘం నాయకులు కోరగా, రిజర్వాయర్‌ను పూర్తి చేసే భాద్యత తనదని మంత్రి హామీ ఇచ్చారు. గిరిజనులకు సాగు పట్టాలు ఇవ్వాలని, గిరిజన గ్రామాలకు తాగునీరు, రోడ్లు లేక గిరిజనులు ఇబ్బంది పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా యుద్ధ ప్రాతిపదికన సమస్యలు పరిష్కరిస్తామని ఆమె హామీఇచ్చారు.