రాష్ట్రప్రభుత్వం ఆగస్టు నెలలో కూడా సచివాలయ సిబ్బంది ద్వారానే పింఛన్లను ఇంటింటికి పంపిణీ చేయనుంది. ఈ మేరకు ఒంగోలు జిల్లాకు ఆదేశాలు అందాయి. జిల్లాలో సామాజిక పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య మొత్తం 2,91,419 ఉండగా వీరికి పంపిణీ చేసేందుకు రూ.123.92 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. గత వైసీపీ పాలనలో ఈ సొమ్మును వలంటీర్ల ద్వారా పంపిణీ చేయించగా కొత్త గా ఏర్పడిన కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బందినే ఇంటికి పంపించి అందజేస్తోంది. ఇంతేకాకుండా పింఛన్ సొమ్మును భారీగా పెంచింది. జిల్లాలో మొత్తం 5,723 మంది సచివాలయ సిబ్బంది ఉండగా పింఛన్లు అందజేసేందుకు వీరు సరిపోకపోవడంతో ప్రభుత్వం ఇతర శాఖల ఉద్యోగులను కూడా కేటాయించింది. వీరంతా ఆగస్టు ఒకటో తేదీనే ఇంటి వద్దకు వెళ్లి పింఛన్ సొమ్మును అందజేస్తారని డీఆర్‌డీఏ, వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్ వసుంధర తెలిపారు. తొలిరోజే 99శాతం మందికి పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె చెప్పారు.