పాలకొండ పట్టణాన్ని అందరం కలిసి అభివృద్ధి చేద్దామని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం పాలకొండ నగర పంచాయతీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలను పక్కనపెట్టి పాలకొండ అభివృద్ధి చేద్దామన్నారు. ముందుగా డంపింగ్‌యార్డు సమస్య పరిష్కారానికి చొరవ చూపుతానని చెప్పారు. సీతంపేట మండలంలో డంపింగ్‌యార్డుకు సంబంధించి స్థలం పరిశీలించారని, రెండు మండలాల రెవెన్యూ సిబ్బందితో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటే ఆ స్థలాన్ని గుర్తిద్దామని చెప్పారు. పట్టణం పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలకు ఆరోగ్యం చేకూరుతుందన్నారు. అందుకుగాను కౌన్సిలర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం పారిశుధ్య పనులకు రూ.23లక్షలు కేటాయించినందున ఈ నిధులు అన్ని వార్డుల్లోనూ పూర్తిస్థాయిలో ఖర్చు చేసి పారిశుధ్యం మెరుగుపరుద్దామని సభ్యులకు తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన పాలకొండ పట్టణంలో చీకటి సమస్య లేకుండా చూడాలని ఏఈ దేవీ ప్రసాద్‌కు సూచించారు. అవసరమైతే కొత్త దీపాలు కొనుగోలు చేయాలన్నారు. నాలుగో వార్డు గారమ్మకాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉందంటూ సభ్యులు కొరికాన గంగునాయుడు, దుప్పాడ పాపినాయుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. డంపింగ్‌యార్డు స్థలం లేనందున ఈ సమస్యను పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు సభ్యులు గంటా సంతోష్, వెలమల మన్మధరావు కోరారు. పోతులగెడ్డలో ఆ క్రమణలు పెరిగిపోయామని సభ్యుడు కిల్లారి మోహన్ సభ దృష్టికి తీసుకొచ్చారు. పోతలగెడ్డలో ఆక్రమణలు పెరిగాయని సభ్యుడు కిల్లారి మోహన్ సభ దృష్టికి తీసుకొచ్చారు. పట్టణం లోని రాయుడుకోనేరు చెరువు అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. వెంకటరాయుడు కోనేరులో లీజు లేకుండా చేపల పెంపకం సరికాదని సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో నగర పంచాయతీ చైర్‌పర్సన్ యందవ రాధాకుమారి, ఉపాధ్యక్షులు పల్లా ప్రతాప్, కమిషనర్ సర్వేశ్వరరావు పాల్గొన్నారు.