ఒంగోలు జిల్లాలోని ఆక్వా రైతులు మళ్లీ కుదేలయ్యారు. ప్రతిసారీ వైరస్ కారణంగానో, లేక ధరలు పడిపోవడం వల్లో దెబ్బతినే ఆక్వా రంగం ఈసారి నాసిరకం సీడ్‌తో అతలాకుతలమవుతోంది. గత కొన్నేళ్లుగా టైగర్ రకం రొయ్యల సాగువైపు రైతులు మొగ్గుచూపుతున్నారు. వెనామీ రకం రొయ్యలకు డిమాండ్ తగ్గటంతో టైగర్ (మోనోడాన్)పై దృష్టిసారించారు. గత ఐదేళ్లుగా జిల్లాలో ఈ రకం సాగు పెరుగుతూ వస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, ఒంగోలు, చినగంజాం, నాగులుప్పలపాడు, వేటపాలెం, చీరాల మండలాల్లో దాదాపు 25వేల హెక్టార్లలో ఆక్వా సాగు జరుగుతోంది. ఇందులో సగానికిపైగా టైగర్ రకం రొయ్యలనే రైతులు సాగుచేస్తున్నారు. ఒంగోలు జిల్లాలో రైతులు నెల్లూరు, గూడూరు, కరేడు ప్రాంతాల నుంచి రైతులు మోనోడాన్ కంపెనీ రొయ్య పిల్లలను తెచ్చి సాగు చేపట్టారు. అయితే ఈ రకం వేసిన చెరువుల్లో పిల్లలు చనిపోతున్నాయి. సగానికి సగం కూడా చెరువులో ఉండటం లేదు. బతికిన సగం పిల్లల్లో కూడా ఎదుగుదల లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వెనామీ రకం సీడ్ చెరువుల్లో లక్షల్లో వేస్తారు. టైగర్‌లోని మోనోడాన్ రకం అయితే ఎకరం విస్తీర్ణంలో 30వేల పిల్లలను మాత్రమే వదులుతారు. వేసినవి కూడా మొత్తం బతక్కపోవడం, బతికి ఉన్న రొయ్యల్లో ఎదుగుదల లేకపోవడంతో రైతుల్లో అయోమయం నెలకొంది. వెనామీ రకం రొయ్యలను 100 కౌంట్‌లో తీసినా గిట్టుబాటవుతుంది. అదే టైగర్‌లోని మోనోడాన్ రకం రొయ్యలను 30లోపు కౌంటులో తీస్తేనే ఖర్చులు చేతికి వస్తాయి. అలా తీసుకు రావాలంటే రైతులు ఐదు నెలలకుపైగా చెరువుల్లో ఉంచి మేత వేయాల్సి ఉంటుంది. అయినా ఆ కౌంట్‌కు ఎదగకపోవడంతో రైతులు నష్టాలను మూటగట్టుకున్నారు. జిల్లాలో టైగర్ రకం రొయ్యల్లో మోనోడాన్ కంపెనీకి చెందిన పిల్లలు సాగు చేసిన రైతులు భారీగా నష్టపో యారు. గత రెండేళ్లు గా నష్టాల్ని చవిచూస్తూనే ఉన్నారు. మోనోడాన్ రకం రొయ్యలను సాగు చేసిన రైతులు ఎకరాకు రూ.5లక్షల మేర నష్టపోయారు.