ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర విద్యుత్‌శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీశైలంలో నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఒంగోలు వెళ్తూ గురువారం పెద్దదోర్నాలలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలంటీర్లు లేకపోయినా సచివాలయ సిబ్బందితో ఒక్క రోజులోనే 99 శాతం పింఛన్లు పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. గిరిజన గూడేల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలని గిరిజన సంఘం కో-ఆర్డినేటర్ భూమని మంతన్న మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి గొట్టిపాటి త్వరలోనే సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. మండల కేంద్రంలోని మసీదు సమీపంలో రహదారి సరిగ్గా లేదని మహిళలు మంత్రికి తెలిపారు. రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు, మండల నాయకులు షేక్ మాబు, దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య పాల్గొన్నారు.