శ్రీకాకుళం జిల్లాలో పర్యాటక అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి గురువారం జిల్లా పర్యాటక మండలి సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా శాలిహుండం మాన్యుమెంట్ కోసం వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. శ్రీముఖలింగం ఆలయం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉందని, వారితో సమన్వయం చేసుకుని అభివృద్ధి చేస్తామని, అరసవల్లి ఆలయ అభివృద్ధికి సంబంధించి జిల్లా నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని, కేంద్ర పర్యాటక శాఖ వద్ద పెండింగ్‌లో ఉందని ఆర్డీ కలెక్టర్‌కు వివరించారు. శ్రీముఖ లింగం ఆలయ అభివృద్ధికి రూ.4కోట్ల రూపాయలు మంజూరు కాగా టెండర్లు పూర్తి అయినట్లు అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ పట్నాయక్ తెలిపారు. అమృత పార్కును అభివృద్ధిని చేసి థర్డ్ పార్టీకి ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గొట్టా బ్యారేజి వద్ద బోటింగ్ ఏర్పాటుకు పాయింట్ గుర్తించామని పర్యాటకాధికారి నారాయణరావు తెలిపారు. ఇప్పిలి వద్ద పర్యాటక అభివృద్ధి కోసం భూసర్వే చేయాలని కలెక్టర్ ఆర్డీవోను ఆదేశించారు. టెంపుల్ టూరిజం, ఖాదీ వస్త్రాలు, బ్యారేజీ, మందస కోవా, మహేంద్రగిరి, తదితర ముఖ్య విషయాలను కలెక్టర్‌కు సమాచార పౌర సంబంధాల అధికారి చెన్నకేశవరావు వివరించారు. అభివృద్ధికి సంబంధించి నిధులు మంజూరు చేస్తామని, పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి ఒక జాబితా తయారు చేసి అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవోలు సీహెచ్ రంగయ్య, భరత్ నాయక్, సుదర్శన దొర, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, ఆర్డీ శ్రీనివాసరావు, ఇతర అధికారులు, వివిధ హోటళ్ల యజమానులు పాల్గొన్నారు. - కోపరేటివ్ అభివృద్ధి వ్యవసాయ సహకార సంఘాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. డీఎల్‌ఈఈ, డీసీడీసీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మంజూరైన గొడౌన్లు, వాటి ప్రస్తుత పరిస్థితి, పురోగతిపై చర్చించారు. జాయింట్ రిజిస్ట్రార్ ఎస్.సుబ్బారావు, వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్, డీసీసీబీ సీఈవో వరప్రసాద్, డీపీవో వేంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.