ఒంగోలు జిల్లా, నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామంలో 1994 జూలై 7న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లక్ష్యంతో ఎమ్మార్పీఎస్ ఆవిర్భవించింది. వరంగల్‌కు చెందిన పూర్వపు రాడికల్ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 13 మంది యువకులతో సమితి ఏర్పడింది. మందకృష్ణ అధ్యక్షుడిగా వ్యవహరించగా వామపక్ష విద్యార్థి ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన టంగుటూరు మండలం కారుమంచికి చెందిన కృ పాకర్ మాదిగ కార్యదర్శిగా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈదుమూడికి చెందిన కొమ్మూరి కనకారావు, ఉసురుపాటి బ్రహ్మయ్య, పిల్లి మాణిక్యాలరావు వంటి జిల్లావాసులు ఉద్యమాన్ని జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా విస్తర్తింపజేయడంలో మందకృష్ణకు తోడుగా నిలిచారు. రాజకీయ, సామాజిక అంశాలపై మందకృష్ణ చురుకుగా కదులుతున్న సమయంలో ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడుగా కొమ్మూరి కనకారావు, ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత అధ్యక్షుడిగా బ్రహ్మయ్య మాదిగలు ఎంపిక కావడం జిల్లాలో ఆ ఉద్యమానికి ఉన్న బలమైన బంధానికి నిదర్శనం. ఈదుమూడిలో ఆవిర్భావంతోపాటు ఒంగోలు కేంద్రంగా కార్యక్రమాలు పెద్దఎత్తున సాగాయి. కాగా కొంతకాలం తర్వాత ఇలాంటి కీలక నాయకులు విభేదాలతో ఒకరికి ఒకరు దూరమైనా ఎవరి పరిధిలో వారు ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.