నంద్యాల, వేంకటేశ్వర పురంలోని ఎస్‌డీఆర్ వరల్డ్ స్కూల్, ఎస్‌డీఆర్ జూనియర్ కాలేజిలోని విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. సుమారు 100 మంది విద్యార్థుల వరకూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం అనంతరం వాంతులు, విరేచనాలతో విద్యార్థులు విలవిల్లాడిపోయారు. గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం చికిత్స అందిస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులంతా హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. తమ పిల్లలకు ఏం జరిగిందో తెలియక వారంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతంలోనూ తిరుపతి జిల్లా నాయుడుపేటలోని అంబేడ్కర్ గురుకులంలో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అప్పుడు కూడా ఫుడ్ పాయిజన్ వల్ల దాదాపు 100 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు రోజుల కిందట వండిన ఆహార పదార్థాలను మధ్యాహ్నం భోజనంలో భాగంగా విద్యార్థులకు వడ్డించారని విద్యార్థులు తెలిపారు. కలుషిత ఆహారం కారణంగానే విద్యార్థులు ఇలా అస్వస్థతకు గురయ్యారని వైద్యులు సైతం ధృవీకరించారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల హాస్టళ్లల్లో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. ఇష్టానుసారంగా కనీసం ఆహారం తయారు చేసే సమయంలో సైతం పట్టించుకోవడం లేదు. పురుగులు పడిన.. లేదంటే బల్లి పడినా కూడా చూసుకోకుండా అదే ఆహారాన్ని విద్యార్థులకు వడ్డిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో పాచిపోయిన ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. దీంతో పిల్లలు అస్వస్థతకు గురవుతున్నారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.