ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును వైసీపీ అధ్యక్షుడు జగన్ ఖరారుచేశారు. శుక్రవారమిక్కడ తాడేపల్లి నివాసంలో.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో పోటీ చేసిన అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ వైసీపీ నుంచి జనసేనలో చేరడంతో ఆయనపై అనర్హత వేటు పడింది(ఆయన విశాఖ దక్షిణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు). దీంతో ఈ ఉపఎన్నిక వచ్చింది. ఈ నెల 6న నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆ రోజు నుంచి 13వ దాకా నామినేషన్లను స్వీకరిస్తారు. 14న వాటిని పరిశీలిస్తారు. అనివార్యమైతే ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరుగుతుంది. సెప్టెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితం ప్రకటిస్తారు. అయితే విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు స్థానికేతరుడు, విజయనగరం జిల్లాకు చెందిన బొత్సను ఎంపిక చేయడంపై వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంకోవైపు.. ఉప ఎన్నికలో పోటీపై టీడీపీ కూటమి శనివారం తన నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. పోటీ పై చర్చించేందుకు కూటమి పార్టీల నేతలు అనకాపల్లిలో శనివారమే సమావేశమవుతున్నారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తన పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో ఈ భేటీ నిర్వహిస్తున్నారు. పోటీకి టీడీపీ నేతలు పీలా గోవింద్, గండి బాబ్జీ తదితరులు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ ఉప ఎన్నికలో ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల కౌన్సిలర్లు, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లు.. మొత్తం 822 మంది ఓటర్లుగా ఉన్నారు.