రాజమహేంద్రవరంలో ఆక్రమణలను కట్టడి చేయాలని మునిసిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయం కౌన్సిల్ హాలులో టౌన్ ప్లానింగ్, పబ్లిక్ హెల్త్ విభాగం అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన స్థలాలను కాపాడాలని, ఆయా స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా కట్టడి చేయాలన్నారు. నగరంలో ప్రభుత్వ స్థలాలు గుర్తించాలని, వాటి రికార్డులను సిద్ధంచేసుకోవాలన్నారు. రోడ్ల విస్తరణకు ప్రణాళికను తయారు చేయాలని, విస్తరణకు అడ్డువచ్చే అనధికార నిర్మాణాలను గుర్తించాలన్నారు. అనేకచోట్ల పుట్‌పాత్‌లు, కాలువలపై ఇనుప వ్యర్ధాలు వేసి ఉండటాన్ని గమనించామని వాటిని వెంటనే తొలగించాలని, అన్ని కాలువల్లో డీసిల్టేషన్ చేయాలని ఎంహెచ్‌వోను ఆదేశించారు. వీధి వ్యాపారులను నియంత్రించడానికి వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలన్నారు. సిబ్బంది ఎప్పటికప్పుడు ఆయా సమస్యలకు సంబంధించిన ఫొటోలు తీసుకోవాలని, అవసరమైన చోట వీడియోలు తీసుకోవాలన్నారు. నగరాన్ని పోస్టర్ ఫ్రీ సిటీగా ప్రకటించినా అక్కడక్కడా పోస్టర్లు అంటిస్తున్నారని, వాటిని తొలగించడంతో పాటు జరిమానాలు విధించాలని ఆదేశించారు. డ్రైనేజీ అక్రమణలను ముందే గుర్తించి భవనాల యజమానులను హెచ్చరించాలన్నారు. సమావేశంలో సిటీ ప్లానర్ డీవీఎస్‌ఎన్ మూర్తి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాలాజీ, ఎంహెచ్‌వో డాక్టర్ వినూత్న, శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.