ఓ రైతు పంటను విక్రయించి డబ్బులు తీసుకున్నాడు. ఆ కరెన్సీ కట్టను తీసుకొచ్చి ఇంట్లో ఉన్న బీరువాలో ఉంచాడు.. తెల్లవారిన తర్వాత ఆ డబ్బులు తీసి అవసరాల కోసం ఉపయోగించుకుందామనుకున్నాడు. సీన్ కట్ చేస్తే తెల్లవారే సరికి బీరువా తీయగానే డబ్బులు ఉన్నాయి కానీ ఊహించని ట్విస్ట్ ఎదురైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలంరేపింది.
జి.మాడుగల మండలం రాపల్లికి చెందిన రైతు బుఠారీ రామారావు పసుపును పండించాడు. ఆ పంటను తీసుకెళ్లి ఎప్పటిలాగే సంతలో అమ్ముకున్నాడు.. మొత్తం రూ.10వేలకుపైగా వచ్చాయి. మొత్తం ఐదు వందల రూపాయల నోట్లతో కట్ట చేతికి వచ్చింది.. అయితే ఆ డబ్బును తీసుకెళ్లి ఇంట్లో బీరువాలో దాచుకున్నాడు రామారావు. ఆ డబ్బుల్ని తన అవసరాల కోసం ఉపయోగించుకుందామని అనుకున్నాడు.
రైతు డబ్బులు తీసేందుకు తర్వాత బీరువా ఓపెన్ చేసి చూస్తే.. నోట్లు ఉన్నాయి కానీ ఊహించని సీన్ కనిపించింది. దాదాపు అన్ని నోట్లు ముక్కలు ముక్కలుగా కనపించాయి. డబ్బుల్ని అలా చూసి రైతు షాకయ్యారు.. కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఇలా ముక్కలు కావడంతో ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బుల్ని ఎలుకలు ఇలా ముక్కలు చేశాయని గుర్తించాడు. కష్టపడి పంట పండించి సంపాదించిన డబ్బులు ఇలా ఎలుకల పాలయ్యాయంటూ వాపోయాడు రామారావు. ఎలుక కొరకడం వల్ల పాడైపోయిన నోట్లు ఎలాగైనా మార్చాలని బ్యాంకువారిని కోరాడు.
గతంలో కూడా ఇలాంటి ఘటను చాలానే జరిగాయి. కొంతమంది రైతులు వ్యసాయానికి పెట్టుబడి కోసం అప్పు తెచ్చి మరి ఇంట్లో పెట్టిన డబ్బుల్ని చెదలు, ఎలుకలు కొరికి ముక్కలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే పెద్దగా డ్యామేజ్ కాని నోట్లను బ్యాంకుల్లో మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఎక్కువ డ్యామేజ్ ఉండే నోట్లను మాత్రం తీసుకోరు.. కాబట్టి ఆ కరెన్సీ నోట్లలో కొద్దిగా డ్యామేజ్ అయిన నోట్లను మార్చుకోవచ్చు.