ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కలెక్టర్లతో సమావేశం,,నవ్వుతూనే స్వీట్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 05, 2024, 09:48 PM

ఇకపై తాను ఆకస్మిక తనిఖీలకు వస్తానని కలెక్టర్లతో ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మళ్లీ 1995 చంద్రబాబును చూస్తారని గతంలోనే చెప్పానన్నారు. తాను ఇంకా ఆ స్పీడ్ పెంచలేదని.. గతంలో తనతో పాటూ మంత్రులు, అధికారులు పరిగెత్తేవాళ్లన్నారు. త్వరలోనే కచ్చితంగా 1995 చంద్రబాబును చూస్తారని.. పాలనలో దూకుడు పెంచుతామన్నారు. ప్రజలకు తమకు అధికారాన్ని ఇచ్చి గౌరవించారని.. కలెక్టర్లు, ఇతర అధికారుల ద్వారా ప్రభుత్వం ప్రజలకు పనులు చేయించాలన్నారు. కలెక్టర్లు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని.. ఒకప్పుడు ఐఏఎస్ అధికారులు డ్రైన్‌లలో దిగిన రోజులు కూడా ఉన్నాయన్నారు. అధికారుల సహకారం లేనిదే అభివృద్ధి సాధ్యం కాదని.. అధికారులు ప్రొఫెషనల్స్, ఆ సమర్థత వారికి ఉందన్నారు. రాష్ట్రంలో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ప్రతి నెలా ఒకటో తేదీన పేదల సేవలో అనే కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. పింఛన్ల పంపిణీలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుని.. పేదరికం లేని సమాజం కోసం పనిచేయాలన్నారు.


రాబోయే రోజుల్లో అంగన్వాడీలకు వెళతా.. డ్రైన్లను పరిశీలిస్తానని చంద్రబాబు అన్నారు. పని చేసే బాధ్యత అధికారులదని.. పని చేయించే బాధ్యత తమదన్నారు. ప్రజల కోసం పని చేయాలనుకునే కలెక్టర్లకు ఇది చాలా చక్కటి అవకాశమన్నారు. బెస్ట్ కలెక్టర్ అనిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గతంలో తాను ముఖ్యమంత్రి అయిన సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని.. అయితే ఇప్పుడు మాత్రం ఆఫీసర్లలో మోరల్ దెబ్బతిందన్నారు. ఈ రాష్ట్రానికి బ్రాండ్ ఏపీ లేకుండా చేశారని.. చివరికి ప్రభుత్వం అధికారుల మనోభావాలను దెబ్బతీశారన్నారు.


ఢిల్లీకి ఇక్కడి నుంచి వెళ్లిన వారు కేంద్రంలో, ఆర్బీఐలో చాలా కీలకంగా మారామన్నారు చంద్రబాబు. కొందరు అధికారులు తమ సమర్థతతో వరల్డ్ బ్యాంకులో కూడా పనిచేశారని చెప్పుకొచ్చారు. చిన్న తప్పు జరిగితే దాన్ని సరిచేయడం సులభమేనని.. అయితే విధ్వంసం జరిగిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే శ్రమించక తప్పదన్నారు. తాను మొదటి సారి ముఖ్యమంత్రి అయిన సమయంలో కరెంటులేని గ్రామాలు ఉన్నాయని.. ఆ తర్వాత కాలం వేగంగా మారి.. ఇప్పుడు డ్రైవర్ లెస్ కార్లు వచ్చేశాయన్నారు. 2029కి మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ గట్టిగా పనిచేస్తే 2047 నాటికి మొదటి స్ధానంలోకి వెళతామని ధీమాను వ్యక్తం చేశారు.


రాష్ట్రంలో ఎంత పెట్టుబడి పెట్టామనేదానికంటే ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయన్నదే ముఖ్యమన్నారు చంద్రబాబు. డెమెగ్రాఫిక్స్ మేనేజ్‌మెంట్ చేయడం ఎంతో అవసరమని.. లింకింగ్ ఆఫ్ రివర్స్ అనేది రాష్ట్రంలో అయినా చేయగలగాలన్నారు. స్కిల్ సెన్సెస్‌లో జిల్లా, మండల లెవల్ జీఎస్‌డీపీ కూడా తీస్తామని.. వర్క్ హర్డ్, వర్క్ స్మార్ట్ , థింక్ గ్లోబల్లీ ఉండాలన్నారు. 1995 సమయంలో హైదరాబాద్‌లో బెస్ట్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయగా.. దాన్ని ఆ తర్వాత వచ్చిన వారు కొనసాగించారన్నారు సీఎం చంద్రబాబు. ప్రపంచంలో అతి ఎక్కువ పెర్ కెపిటా ఇన్ కం సాధించిన వారు ఇండియన్స్.. అందులో 30 శాతం తెలుగువారు ఉండటం గర్వకారణం అన్నారు. ఈ కలెక్టర్ కాన్పరెన్స్ ఈ రాష్ట్రం దశ దిశను సూచించేదిగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్కసారి తప్ప.. ఆ తర్వాత ఒక్క కలెక్టర్ కాన్ఫురెన్స్ పెట్టలేదంటే ఎంతదారుణమో అర్ధం చేసుకోవాలన్నారు. చంద్రబాబు ప్రసంగం తర్వాత విజన్ ఆంధ్రా @2047 డాక్యుమెంటును ప్రణాళికా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ ప్రెజెంట్ చేశారు. ఆ తర్వాత వివిధ రంగాలపై చర్చ జరిగింది. సాయంత్రం జిల్లా ఎస్పీలతో కూడా సమావేశంలో చర్చించనున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com