ఆంధ్రప్రదేశ్‌లో లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసే విషయమై నిబంధనలు సడలిస్తామని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అలాగే.. రూల్స్ ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. విజయవాడలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రంలోని బిల్డర్ల అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివాదాస్పద ఆర్-5 జోన్ అంశాన్ని మంత్రి ప్రస్తావించారు. అమరావతిలోని ఆర్ - 5 జోన్‌లో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో స్థలాలు పొందిన వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని నారాయణ తెలిపారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఆదేశించారన్న నారాయణ.. ఎవరికైతే అక్కడ స్థలాలు కేటాయించారో వారిని గుర్తించి సొంత ప్రాంతాల్లోనే స్థలాలు ఇస్తామన్నారు. అలా వీలు కాని పక్షంలో టిడ్కో ఇళ్లు కేటాయిస్తామని నారాయణ ప్రకటించారు. సీఆర్డీఏలో లబ్దిదారులు ఉంటే వారికి అక్కడే ఇళ్లు కేటాయిస్తామని నారాయణ తెలిపారు.
మరోవైపు బుధవారం నుంచి అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులను అధికారులు ప్రారంభించనున్నారు. దట్టంగా పేరుకుపోయిన ముళ్ల కంపలు, చెత్తా చెదారాన్ని తొలగించే ప్రక్రియ రేపటి నుంచి మొదలుకానుంది. మొత్తం 58 వేల ఎకరాల్లో ఉన్న తుమ్మ చెట్లు, ముళ్ల కంపలను నెలరోజుల్లోగా తొలగిస్తామని నారాయణ తెలిపారు. జంగిల్ క్లియరెన్స్ తర్వాత రాజధాని ప్రాంతంలో భూములు కేటాయించిన వారికి తమ స్థలంపై అవగాహన వస్తుందని వివరించారు. మొత్తం 99 డివిజన్లలోనూ ఒకేసారి జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమవుతాయని నారాయణ వెల్లడించారు.
ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న లేఅవుట్ల విషయాన్ని నారాయణ ప్రస్తావించారు. ఇలాంటి అక్రమ లేఅవుట్లపై ప్రజలకు సమాచారం ఇస్తామని మంత్రి చెప్పారు. ఇలాంటి అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి, భవనాల నిర్మాణం ప్రారంభించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న మంత్రి.. వీటిపై పేపర్లు, టీవీల ద్వారా ప్రజలకు సమాచారం ఇస్తామని వెల్లడించారు. అలాగే అనధికార లేఅవుట్లు ఉన్న సర్వే నంబర్లను రిజిస్ట్రార్ ఆఫీసులకు ఇస్తామన్న నారాయణ.. ఇలా చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ సమయంలో ప్లాట్లు కొనుగోలు చేస్తున్న వారికి లేఅవుట్ల గురించి పూర్తి సమాచారం తెలుస్తుందన్నారు.. దీనికోసం రాబోయే మూడు నెలల్లో ప్రత్యేక వెబ్‌సైట్ తెస్తామని మంత్రి వివరించారు.