శ్రీవారి హుండీలలో కానుకలుగా వచ్చిన సెల్‌ఫోన్లు, వాచీలను టీటీడీ వేలం వేయనుంది. రెండు రోజుల పాటు ఈ వేలం ప్రక్రియ కొనసాగనుంది. ఆగస్ట్ 12, 13వ తేదీలలో సెల్‌ఫోన్లు, వాచీలను వేలం వేయనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో భక్తులు హుండీలలో కానుకలు సమర్పిస్తూ ఉంటారు. నగదుతోపాటుగా సెల్‌ఫోన్లు, వాచీలను కానుకలుగా సమర్పించుకుంటూ ఉంటారు. ఇలా వచ్చిన ఫోన్లు, వాచీలను టీటీడీ ప్రతినెలా వేలం వేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఈ నెల కూడా 12 ,13వ తేదీల్లో టెండర్ కమ్ వేలం(ఆఫ్ లైన్) ద్వారా వేలం వేయనున్నారు.
ప్రముఖ మొబైల్ ఫోన్ బ్రాండ్లు అయిన సోనీ, మోటరోలా, ఎల్‌జీ, రెడ్ మీ, ఎంఐ, ఐటెల్, రియల్ మీ, పోకో, మైక్రోమాక్స్, ఆనర్, నోకియా, లావా, కార్బన్, జియో, సెల్ కాన్, ఆసస్, హువై, వంటి సంస్థల ఫోన్లను వేలం వేస్తున్నారు. ఇందులో ఉపయోగించనవే కాకుండా పాక్షికంగా దెబ్బతిన్న ఫోన్లను సైతం వేలంపాటలో ఉంచుతున్నారు. అదే విధంగా టైటాన్, ఫాస్ట్ ట్రాక్, సొనాటా, హెచ్ఎంటీ, టైమెక్స్, వంటి బ్రాండెడ్ వాచీలను కూడా వేలం వేస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు తిరుపతిలోని హరేకృష్ణ మార్గ్‌లో ఉన్న టీటీడీ ఆఫీసులో జనరల్ మేనేజర్‌ను సంప్రదించాలని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
లడ్డూ కౌంటర్లను పరిశీలించిన ఆదనపు ఈవో
తిరుమల అదనపు ఈవో వెంకయ్య చౌదరి మంగళవారం తిరుమలలోని లడ్డూ కౌంటర్లను పరిశీలించారు.లడ్డూ కాంప్లెక్స్‌ను అధికారులతో కలిసి తనిఖీ చేశారు. అలాగే దర్శనం టిక్కెట్లపై కౌంటర్లలో లడ్డూలు జారీ చేసే విధానాన్ని టీటీడీ అదనపు ఈవో పరిశీలించారు.లడ్డూ ప్రసాదాల తయారీకి సంబంధించిన ముడిసరుకుల నిల్వ ఉన్న ఉగ్రాణం కూడా అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. తిరుమల కొండపై ప్రక్షాళన కోసం టీటీడీ ఈవో శ్యామలరావు నియమించిన ఏపీ ప్రభుత్వం.. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అదనపు ఈవోను కూడా నియమించింది. ఢిల్లీలో కేంద్ర సర్వీసుల్లో ఉన్న వెంకయ్య చౌదరిని డిప్యుటేషన్ మీద ఏపీకి రప్పించి.. టీటీడీ అదనపు ఈవో బాధ్యతలు అప్పగించింది.