ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ సిక్స్ పేరిట ఆరు హామీలు ఇచ్చిన టీడీపీ కూటమి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఆగస్ట్ 15 నుంచి మూడు పథకాలను ఏపీ ప్రభుత్వం అమలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకం, అన్న క్యాంటీన్లను ఆగస్ట్ 15 నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై ఇప్పటికే స్పష్టత ఉంది. ఆగస్ట్ 15 నుంచి 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలోనే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
ఇక వీటితో పాటుగా తల్లికి వందనం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీలను కూడా అమలు చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. గత కొన్నిరోజులుగా వివిధ శాఖలపై వరుసగా సమీక్షలు జరుపుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుుడు.. ఈ పథకాల అమలుపైనా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుపై ఇప్పటికే ఎంత ఖర్చు అవుతుందనే దానిపై అధికారులు లెక్కలు తయారు చేశారు. ప్రతినెలా రూ.250 కోట్ల వరకూ భారం పడొచ్చని అంచనాకు వచ్చారు. ఇక పథకం అమలు చేసేందుకు పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను ప్రభుత్వం పరిశీలించనుంది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో తెలంగాణ తరహాలో ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకుని ముందుకు పోవాలా.. లేదా కర్ణాటక తరహాలో మహాలక్ష్మి కార్డులు మాదిరిగా కార్డులు జారీచేయాలా అనే దానిపైనా అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరోసారి తెలిపారు. చిత్తూరులో ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఆయన.. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. దీంతో ఆగస్ట్ 15 నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయవచ్చంటూ ప్రచారం జరుగుతోంది.
ఇక తల్లికి వందనం పథకం విషయానికి వస్తే పిల్లలను బడికి పంపే తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు జమచేస్తామని అప్పట్లో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఎంత మంది పిల్లలు ఉన్నాకూడా.. ఒక్కొక్కరికీ రూ.15 వేలు చొప్పున అందిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఈ పథకం అమలుపైనా ఫోకస్ పెట్టింది టీడీపీ కూటమి ప్రభుత్వం. ఆగస్ట్ 15 సందర్భంగా అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.