దేశ ప్రధాని పదవి, దేశం, సామ్రాజ్యం అన్నీ వదిలేసి.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. బ్రతుకు జీవుడా అంటూ భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు.. అడుగడుగునా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఢాకాలోని ప్రధాని ప్యాలెస్‌ను ఆందోళన కారులు చుట్టుముట్టడం, 45 నిమిషాల్లో పదవికి రాజీనామా చేసి.. పారిపోవాలని బంగ్లాదేశ్ ఆర్మీ ఇచ్చిన అల్టిమేటంతో సోదరి షేక్ రెహానాతో కలిసి భారత్‌కు ఆగమేఘాల మీద వచ్చిన షేక్ హసీనా.. ఢిల్లీ నుంచి లండన్ వెళ్లి అక్కడే స్థిర పడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే బ్రిటన్‌లో ఆశ్రయం కల్పించాలని అక్కడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన బ్రిటన్ ప్రతినిధి షేక్ హసీనాకు తలుపులు తెరిచిలేవని పేర్కొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో షేక్ హసీనా మరికొంతకాలం భారత్‌లోనే ఉండనున్నారు.
బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి.. ప్రస్తుతానికి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఢిల్లీ నుంచి లండన్ వెళ్లాలనేది ఆమె ప్లాన్ అని సోమవారం నుంచి ప్రచారం జరుగుతోంది. కానీ పరిస్థితులు మాత్రం ఆమెకు అనుకూలించడం లేదు. బ్రిటన్‌లో ఆశ్రయం పొందేందుకు షేక్ హసీనా చేసిన విజ్ఞప్తికి అక్కడి నుంచి ప్రతికూల స్పందనే కారణం. ఒక వ్యక్తి ఆశ్రయం కోసం లేదా శరణార్థిగా తమ దేశానికి వచ్చేందుకు తమ వలసచట్టాలు అంగీకరించవని బ్రిటన్ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి తాజాగా ఓ మీడియాతో మాట్లాడారు.
ఏదైనా అవసరంలో ఉన్న వారికి రక్షణ కల్పించే విషయంలో బ్రిటన్‌కు ఎంతో మంచి రికార్డు ఉందని.. ఎంతోమందికి అలా రక్షణ కల్పించినట్లు ఆయన తెలిపారు. అయితే ఆశ్రయం కోరుతూ లేదా తాత్కాలిక శరణార్థిగా ఒక వ్యక్తి యూకే వచ్చేందుకు అనుమతించేలా తమ వలస చట్టాల్లో ఎలాంటి నిబంధన లేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ రక్షణ కోరేవారు.. ప్రస్తుతం వారు ఉంటున్న సురక్షిత ప్రదేశంలోనే ఆశ్రయం పొందాలని.. అదే వారి రక్షణకు అత్యంత సులభమైన మార్గమని మీడియాకు తెలిపారు. అంటే షేక్ హసీనా బ్రిటన్‌లో ఆశ్రయం పొందడం కంటే ఇప్పుడు ఉన్న భారత్‌లోనే ఆమె ఉండాలని పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే షేక్ హసీనా సోదరి షేక్ రెహానా.. బ్రిటన్ పౌరురాలు. పైగా షేక్ రెహానా కుమార్తె తులిప్ సిద్దిఖీ.. ప్రస్తుతం బ్రిటన్‌లో అధికారంలో ఉన్న లేబర్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యురాలిగా కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే బ్రిటన్ ప్రభుత్వం తనకు సులభంగా ఆశ్రయం ఇస్తుందని భావించిన షేక్ హసీనా.. ఆ దేశాన్ని సాయం కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఇప్పటికే బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న పరిణామాలపై బ్రిటన్ ప్రభుత్వం స్పందించింది. గత కొన్నిరోజులుగా బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అల్లర్ల కారణంగా జరిగిన హింసాత్మక ఘటనలు, ప్రాణ నష్టంపై ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలని కోరింది. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం మార్పు శాంతియుతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించింది.