‘రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ‘విజన్ 2047’పై చేసిన దిశానిర్దేశం ప్రకారం రాజమహేంద్రవరం జిల్లాలో రాబోయే 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఆయా శాఖలు రూపొందించిన ప్రాజెక్టు నివేదికల ఆధారంగా జిల్లా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయవలసి ఉంది’ అని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి స్పష్టంచేశారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం సాయంత్రం ఆమె ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ జి.నరసింహులుతో కలసి జిల్లా డివిజన్, మండల స్థాయి అధికార్లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వ హించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..... జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ఈ ప్రణాళికను సిద్ధంచేయాలన్నారు. ‘విజన్ 2047’ నోడల్ అధికారిగా జిల్లాస్థాయిలో ముఖ్య ప్రణాళికా అధికారిని నియమించినట్టు చెప్పా రు. త్వరలో రాష్ట్రస్థాయి శిక్షణా కార్యక్రమానికి జిల్లా నుంచి ఐదుగురు అధికారులు, సిబ్బందిని మాస్టర్ ట్రైనింగ్ కోసం పంపించనున్నట్టు చెప్పారు. శిక్షణ తీసుకున్నవారు జిల్లాలో శాఖలవారీ సహాయ శిక్షణ బృందాలు ఏర్పాటుచేసి కార్యక్రమాలు అమలుచేయనున్నట్టు చెప్పారు. ఇక నుంచి ఉద్యోగు లు అందరూ పరుగులు పెట్టాలి. హార్డ్‌వర్కు కాదు.. స్మార్ట్‌వర్కు ఉండాలని ఆమె స్పష్టంచేశారు. ప్రతికూల కథనాలు, వార్తలకు సంబంధించి అధికారులు సహేతుక వివరణ ఇవ్వవలసి ఉందన్నారు. కౌలు రైతులకు 100 శాతం సీసీఆర్సీ కార్డులు, డేటా ఎంట్రీ పూర్తిచేసి, బ్యాంక్ రుణాలు ఇవ్వాలని చెప్పా రు. వ్యవసాయ, హార్టీకల్చర్ రంగాల్లో కౌలురైతుల వివరాల ప్రకారం సీసీ ఆర్సీ కార్డులు జారీచేయాలన్నారు. భూసార పరీక్షల లక్ష్యాలు పూర్తి చేయాల న్నారు. మధ్యాహ్నం భోజనం పథకం కింద 100శాతం విద్యార్థులు హాజరు కావాలని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సమన్వయ శాఖలతో చర్చించి, ప్రణాళిక రూపొందించి, అమలుచేసే దిశగా ముందుకు వెళ్లాలన్నారు. సమస్య గుర్తించి..ఎందుకు? ఎలా, ఎందుకు కాదు అనే విధా నంలో పరిష్కారం ఉండాలని ఆదేశించారు. ఆయా సమస్యలపై సమగ్ర అవగాహన ఉండాలన్నారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్క లబ్ధిదారునికి ఇళ్ల నిర్మా ణాలపై దృష్టిపెట్టాలని కలెక్టర్ చెప్పారు. మండల ప్రత్యేకాధికారులు ప్రతీ వారం ఒకరోజు క్షేత్రస్థాయిలో హౌసింగ్‌పై సమీక్షించాలని చెప్పారు. మలేరి యా, ఇతర సీజనల్ వ్యాధులపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఈ- ఔషధి, డాక్టర్ల ఫేషియల్ అటెండెన్స్, ఆయుష్‌మాన్ భారత్ హెల్త్ కార్డులు పంపిణీ సక్రమంగా ఉండాలని ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలు, వసతి గృహాల నిర్వహణ తదితర అంశాలపై నివేదిక అందజేయాలన్నారు. పౌర సరఫరాలశాఖ ఆధ్వర్యంలో ధరల నియంత్రణ కమిటీ ద్వారా ఎప్పటి కప్పుడు ప్రతీ ఒక్క వినిమయ వస్తువుల ధరలు నియంత్రణ చేపట్టాలన్నా రు. జిల్లాలో ఆయా వస్తువులను కొనుగోలు చేసి, ధరలు పరిశీలించి, ధరల పెరుగుదల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.