తూర్పుగోదావరి జిల్లాను అన్ని రంగాల్లోను అభివృద్ధి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరంలోని హోటల్ రివర్‌బేలో మంగళవారం రాత్రి జిల్లాలో కూటమి ప్రజాప్రతినిధులను టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌సెక్రటరీ యర్రా వేణుగోపాలరాయుడు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. దీనికి మంత్రి దుర్గేష్, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణలు అతిథులుగా హాజరయ్యారు. ఈసందర్భంగా వారిని యర్రా వేణుగోపాలరాయుడు ఘనంగా సత్కరించారు. తొలుత వేణు మాట్లాడుతూ ఎంతో అనుభవంతో జిల్లాలో అభివృద్ధికి తనదైన ముద్రవేసిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల, ఈ ప్రాంతంపై అవగాహన కలిగిన నేతగా మంత్రి దుర్గేష్, నూతన ఆలోచనలతో అభివృద్ధిని కాంక్షించే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వంటి ఆలోచనపరులు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చాణక్య నీతి, గన్ని కృష్ణలాంటి సీనియర్ కమిట్‌మెంట్ నాయకులు కలిసి జిల్లాలో విద్యా, వైద్యం, ఉపాధి రం గాలను అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ మీ ఉద్దేశానికి తగ్గట్టుగానే ఈ జిల్లాను అభివృద్ధి చేస్తామని చెప్పారు. చంద్రబాబువంటి విజనరీ కలిగిన నాయకుడి సారథ్యంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సహకారం తో తామంతా కష్టపడి పనిచేస్తామన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు పడుతున్న కష్టాన్ని అతి దగ్గరగా చూస్తున్నామన్నారు. మన జిల్లాలో ఎన్నో సహజ వనరులు ఉన్నాయన్నారు. 2027లో పుష్కరాలకు ముందస్తు ప్రణాళికతో అభివృద్ధి చేపడతామన్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలనూ ప్రగతి పథంలో తీసుకువెళ్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బత్తుల బలరామకృష్ణలు మాట్లాడారు. జిల్లా అభివృద్ధితో శక్తివంచన లేకుండా తామంతా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర ఇంచార్జి అనుశ్రీ సత్య నారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, యనుముల రంగబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌కుమార్, టీడీపీ శెట్టి బలిజ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్తిబాబు, టీడీపీ నగర ఆర్గనైజింగ్ సెక్రటరీ మరుకుర్తి రవియాదవ్, టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి మణి, నూర్ బాషా సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ సుభాన్, రామినీడి మురళీ పాల్గొన్నారు.