నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు శుభవార్త చెప్పబోతున్నారు. . చంద్రబాబు నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు దాదాపు తుదిదశకు వచ్చినట్లు తెలుస్తోంది. మరో వారం, పది రోజుల్లో తొలివిడత భర్తీ ప్రక్రియ పూర్తి చేయబోతున్నట్లు సమాచారం. టీడీపీతో పాటగా ఎన్టీఏ మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు 18-20% పోస్టులు కేటాయించనున్నారు. ఆ రెండు పార్టీలు పోటీచేసిన దామాషాలోనే నామినేటెడ్ పోస్టులు ఇవ్వబోతున్నారు.
ఈ నామినేటెడ్ పదవుల్ని పనితీరు, సమర్థత, పార్టీపై అంకితభావం వంటి అంశాలను పరిశీలించి నియమిస్తారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడిన వారు.. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ఎవరు నిర్వహించారు?.. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసినవారికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. చిత్తశుద్ధితో పనిచేసినవారు ఎవరనే అంశాల ప్రాతిపదికన రెండు, మూడు నివేదికలు తెప్పించినట్లు తెలుస్తోంది. ఈ కసరత్తు మొత్తం పూర్తి చేసి త్వరలోనే నామినేటెడ్ పదవుల్ని నియమించనున్నారు. ఈ నామినేటెడ్ పదవులపై పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌ల నుంచి విడిగా ప్రతిపాదనలు తీసుకుంటారు.
చంద్రబాబు మిత్రపక్షాల నేతలతో విస్తృతంగా చర్చించి, అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత నేతల పనితీరు, సమర్థతకు మొదటి ప్రాధాన్యమిస్తూ, అదే సమయంలో సామాజిక, ప్రాంతీయ సమీకరణాల్ని బేరీజు వేసుకుంటూ, సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకుని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నామినేటెడ్ పోస్టుల్ని మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి పోస్టుల వరకు ఇదే విధానాన్ని పాటించనున్నారు. పోస్టులు తక్కువ, ఆశావహులు ఎక్కువగా ఉండడంతో కసరత్తుకు కొంత సమయం పడుతోంది. పోస్టులన్నీ ఒకేసారి భర్తీ చేయకుండా.. దశలవారీగా ఆ ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు చెబుతున్నారు.
మరోవైపు ఈ నెల 8న తెలుగు దేశం పార్టీ పొలిట్‌బ్యూరో భేటీని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో పలు కీల అంశాలపై చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించనున్నారు. ప్రధానంగా నామినేటెడ్ పదవుల పంపకంపై చర్చ జరిగే అవకాశం ఉందన్నారు. అలాగే త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటుగా తాజా పరిణామాలపై చర్చించనున్నారు.