మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రత అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆయన ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. తనకు జూన్ 3కు ముందు ఉన్న భద్రతను కల్పించాలని కోరారు.. దీంతో జగన్‌కు కల్పిస్తున్న భద్రత హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా జగన్‌కు కల్పిస్తున్న భద్రతపై ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ భద్రతకు ఏటా రూ.90 కోట్ల ఖర్చు అవసరమా అని ప్రశ్నించారు.
మొత్తం 900 మంది భద్రతా సిబ్బందికి నెలకు రూ.7.50 కోట్ల చొప్పున చూస్తే.. ఏడాదికి రూ.90 కోట్లు ఖర్చవుతుంది అని లెక్కలు చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ ప్రాణాలకు ప్రజల వల్ల ముప్పు లేదని.. ప్రతిపక్షంలో ఉన్న ఆయన ప్రజలతో కలిసి వెళ్లాల్సిన సమయం వచ్చింది అన్నారు. 900 మంది సెక్యూరిటీని పెట్టుకుంటే ఎక్కడకు వెళ్తారు?.. జగన్‌ను ఎవరు ముట్టుకుంటారు అన్నారు. విదేశాల్లో చదువుకునే ఆయన కుమార్తెలకు భద్రత ఎందుకు? అంటూ ప్రశ్నించారు.
మాజీ ముఖ్యమంత్రిగా జగన్‌కు ఇవ్వాల్సినంత భద్రతను ఇచ్చామని.. ఎక్కడా తగ్గింలేదన్నారు హోంమంత్రి అనిత. మాజీ ముఖ్యమంత్రికి 980 మందితో భద్రత అవసరమా.. ఈ సంఖ్య ఒక చిన్న గ్రామంలో ఓటర్ల సంఖ్యతో సమానం అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చిన భద్రతను ఎలా కల్పిస్తామని ప్రశ్నించారు. జగన్‌కు ఐదేళ్ల తర్వాత కోడి కత్తి దాడి గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు.. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆ కేసును ఎందుకు పరిష్కించలేకపోయారన్నారు. ప్రతిపక్ష హోదా, సెక్యూరిటీపై హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేయడం రాజకీయ లబ్ధి మాత్రమే అన్నారు.
జగన్ తాడేపల్లి నివాసానికి పెద్ద ప్రహారీ, బుల్లెట్ ప్రూఫ్ కార్లు, ఇంటి ప్రహరీ గోడలకు విద్యుత్ తీగలు ఉండి కూడా జగన్‌కు 980 మంది రక్షణగా ఉన్నారన్నారు హోంమంత్రి అనిత. తాము వాటి గురించి ఏం అనట్లేదని.. కాని ఎన్డీఏ ప్రభుత్వం భద్రత తీసేసిందనడం సరికాదన్నారు. జగన్ బయటకు వెళ్లిన సమయంలో బుల్లెట్‌ప్రూఫ్ వాహనంతో పాటు ఇవ్వాల్సినంత భద్రత ఇస్తున్నామని.. ఆయన చెబుతున్న మాటలు నిజం కాదన్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించిన 59 మంది గన్‌మన్‌లు సరిపోరా? అని ప్రశ్నించారు ఏపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ ఎన్ తులసిరెడ్డి. తనకు ఇచ్చిన గన్‌మన్‌లు సరిపోరని.. ఇంకా 139 మందిని ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అదనపు భద్రత కోరడం జగన్ పిరికితనానికి నిదర్శనమని.. ప్రభుత్వం 59 మంది గన్‌మన్‌లను ఆయనకు ఇవ్వడమే తప్పన్నారు తులసిరెడ్డి.