వట్టిగెడ్డ రిజర్వాయర్ ద్వారా పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందించకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తామని సీపీఎం విజయనగరం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గంగునాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జియ్యమ్మవలస మండలంలోని అలమండ పంచాయతీ చినతోలుమండగూడ గ్రామ సమీపంలో ఉన్న వట్టిగెడ్డ కాలువను ఆయన బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలోని రావాడ వద్ద ఉన్న వట్టిగెడ్డ రిజర్వాయర్ కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 16,680 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉందన్నారు. అయితే నీటి పారుదలశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కనీసం ప్రాజెక్టు దగ్గరల్లో ఉన్న అలమండ, తుంబలి, అల్లువాడ పంచాయతీ పరిధిలోని భూములకు సాగునీరు అందడం లేదని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్‌కు ఇంతవరకు సగం భూముల్లో వరినాట్లు వేయని దుస్థితి ఏర్పడిందన్నారు. జంగిల్ క్లియరెన్స్ చేయలేదన్నారు. అలాగే జైకా నిధులు మంజూరైనా నత్తనడకనే పనులు చేశారు తప్ప చిత్తశుద్ధితో ఆధునీకరణ పనులు చేయలేదని ఆయన మండిపడ్డారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.