ఉపాధి బిల్లులు చెల్లించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో బలిజిపేట మండల పరిషత్ కార్యాలయం ముందు బుధవారం పలు వురు వేతనదారులు నిరసన చేపట్టారు. సీపీఎం నాయకుడు యమ్మల మన్మథ రావుతో కలిసి ఎంపీడీవో రమేష్ వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా మన్మథ రావు మాట్లాడుతూ ...... ఇప్పటికే మూడు నుంచి ఆరు వారాల బిల్లులు చెల్లించకపోవడం చాలా అన్యాయమని అన్నారు. మండుటెండలో వడదెబ్బకు గురై రెండు పూటలు పనులు చేశారని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 ప్రకారం పనిచేసిన 14 రోజులకు బిల్లులు చెల్లించాలని, లేనిపక్షంలో వడ్డీతో చెల్లించాలని అన్నారు. చట్టం పకడ్బంధీగా అమలు చేయకపోగా చేసిన పనికి కూడా డబ్బులు చెల్లించకపోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఇప్పటికైనా డబ్బులు చెల్లించాలని, లేనిపక్షంలో ఎంపీడీవో కార్యాలయాన్ని ఉపాధి కూలీలతో కలిసి ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు బొద్వాన భానుమూర్తి, పి.వెంకటస్వామి, జి.బలరామనాయుడు, నల్ల ఈశ్వరరావు, ఆవు సాంబమూర్తి, దన్నాన త్రినాధ, అప్పన్న, తదితరులు పాల్గొన్నారు.