బద్వేలు మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, వర్షాకాలంలో మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తున్నా, సిబ్బంది, అధికారులు చర్యలు తీసుకోవడం లేదని కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన రాజగోపాల్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సుధా హాజరయ్యారు. అజెండా అనంతరం మురుగుకాలువలు, పందులు, దోమల బెడద, సీజనల్ వ్యాధుల వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేశారు. మూడేండ్లుగా శానిటేషన అధికారులకు, సిబ్బందికి విన్నవించుకున్నా పట్టించుకోలేదన్నారు. కౌన్సిల్‌లో తెలుగుదేశంపార్టీకి ప్రతిపక్షహోదా ఇవ్వాలని టీడీపీ కౌన్సిలర్ సునీత సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. లక్షల రూపాయలు ఖర్చుచేసి ఏర్పాటు చేసిన పెట్రోలు బంకును ఎందుకు ప్రారంభించలేదంటూ కౌన్సిలర్లు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. డీజిలు, పెట్రోలు పట్టించి మూడునెలలు అవుతుంటే పెట్రోలు ఆవిరైపోతుందని, ఈ నష్టానికి బాధ్యులు ఎవరని సమావేశంలో కౌన్సిలర్లు మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యే సుధ, చైర్మన రాజగోపాల్‌రెడ్డి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధవహింస్తామని, త్వరలోనే పెట్రోలు బంకును ప్రారంభిస్తామన్నారు.