దేశవ్యాప్తంగా కందిపప్పు కొరత ఎక్కువగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఏపీలో కిలో కందిపప్పు రూ.150లకు అందిస్తున్నామని అన్నారు. లక్ష మెట్రిక్ టన్నుల కందిపప్పు కేటాయించాలని.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని కోరామని తెలిపారు. ధాన్యం నిల్వ, గిడ్డంగుల నిర్మాణం కోసం కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో సింహభాగం ఇవ్వాలని కోరామని చెప్పారు. 1.47 లక్షల రేషన్ కార్డులకు రేషన్ అందిస్తున్నామని వివరించారు. కేంద్ర రాష్ట్ర మార్కెటింగ్ శాఖలు నిర్వహించే ప్రైస్ మానిటరింగ్ సెంటర్లను ప్రస్తుతం ఉన్న 5 నుంచి 13కు పెంచాలని కోరామన్నారు. అలాగే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హార్డీప్ సింగ్ పూరీని కలిశానని చెప్పారు. ఉజ్వల స్కిమ్‌లో ఏపీకి నష్టం జరుగుతుందని కేంద్రమంత్రికి తెలిపానని అన్నారు. ఏపీకి విభజన వల్ల నష్టం జరిగిందని.. న్యాయం చేయాలన్న భావన కేంద్ర పెద్దల్లో కనిపిస్తుందని అన్నారు. కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలు తెలిపేందుకు ఎంపీలు, అధికారులు వారి సహకారాన్ని అందించారని వివరించారు. రాష్ట్ర అంశాల పరిష్కారానికి కేంద్రం సుముఖంగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.