పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలు మరికాసేపట్లో షురూ కానున్నాయి. మరో నాలుగేండ్ల తర్వాత మళ్లీ విశ్వ క్రీడా సంబురం మొదలవ్వనుంది. 2028లో జరుగనున్న ఆ ఒలింపిక్స్‌కు అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. అనంతరం 2032 హక్కులు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ సిటీ దక్కించుకుంది. 2036 విశ్వ క్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈజిప్ట్ కూడా ఒలింపిక్స్ నిర్వహించేందుకు ఉత్సాహం చూపిస్తోంది.ఈ ఆఫ్రికా దేశం భారత్‌కు ప్రధాన పోటీదారుగా మారనుంది. ఇప్పటివరకూ ఆఫ్రికా ఖండంలోని ఏ దేశం కూడా ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వలేదు. 2008లో కైరో కొద్దిలో చాన్స్ కోల్పోయింది.ఇప్పటికే భారత్‌తో పాటు సౌదీ అరేబియా, ఇండోనేషియా, ఖతర్‌లు 2036 ఒలింపిక్ హక్కుల కోసం బిడ్డింగ్ వేయాలనే పట్టుదలతో ఉన్నాయి. అయితే.. ఆతిథ్యమిచ్చే దేశం మరికొన్ని రోజుల్లో తేలనుంది.