డబ్బు, మద్యం, గంజాయి, డ్రగ్స్ ఇలాంటివి అక్రమంగా రవాణా చేయడం చట్ట విరుద్ధం. అయితే ఇలాంటి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ తనిఖీలు చేపట్టి ఎక్కడికక్కడ పట్టుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. దాన్ని చూస్తే ఇలా కూడా చేయొచ్చా అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. మద్యం బాటిళ్లు అక్రమంగా సరఫరా చేస్తూ.. ఓ వ్యక్తి పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. పుస్తకాల మధ్యలో మద్యం సీసాలు దాచి.. ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నాడు. ఇలా ఆ వ్యక్తి రోజూ వెళ్తుండగా ఈ క్రమంలోనే తాజాగా పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీలు చేయగా అసలు బండారం బయటపడింది. ఈ సంఘటన బీహార్‌లో చోటు చేసుకుంది.
పుస్తకాల తరలింపు మాటున మద్యం అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని బీహార్ పోలీసులు పట్టుకున్నారు. బీహార్‌లో మద్య నిషేధం అమల్లో ఉండగా.. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్ నుంచి బీహార్‌లోకి అక్రమంగా తీసుకువస్తున్న వ్యక్తిని పట్టుకుని తనిఖీలు చేయగా.. మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. రోజూవారిగానే ఒక వ్యక్తి చేతిలో పుస్తకాలతో ఆటో రిక్షాలో వెళ్తుండగా పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆ ఆటో రిక్షాను ఆపి అతన్ని తనిఖీ చేశారు. అతడి వద్ద ఏమీ లేకపోవడంతో.. పుస్తకాల కట్టపై అనుమానం వచ్చింది. వెంటనే ఆ పుస్తకాల కట్టను విప్పాలని అతడికి పోలీసులు సూచించారు.
అయితే ఆ పుస్తకాల మధ్య నుంచి మద్యం బాటిళ్లు బయటపడటంతో పోలీసులతోపాటు అక్కడ ఉన్న స్థానికులు ఖంగుతిన్నారు. పైన, కింద, పక్కలకు పుస్తకాలు పెట్టిన ఆ వ్యక్తి మధ్యలో మంచిగా మద్యం సీసాలను పేర్చాడు. దీంతో ఎవరికీ అనుమానం రాకుండా.. పైకి పుస్తకాల కట్టలాగే కనపడుతున్నాయి. ఆ పుస్తకాలన్నింటినీ ఒక తాడుతో గట్టిగా కట్టి.. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి బీహార్‌కు మద్యం బాటిళ్లను అక్రమంగా సరఫరా చేస్తున్నాడు.
అయితే ఆ వ్యక్తి మద్యం అక్రమ రవాణా చేస్తున్నాడని బీహార్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో అతడ్ని పట్టుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేయగా.. అసలు గుట్టు రట్టైంది. దీంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆ మందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. బీహార్‌లో మద్యంపై నిషేధం విధించడంతో కొందరు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.