వాహనం తీసుకుని రోడ్డుపైకి వచ్చామంటే.. దానికి సంబంధించిన అన్ని పత్రాలు సరిగ్గా ఉండాలి. అలాంటప్పుడే ఎవరూ మనల్ని ఆపకుండా ఉంటారు. అయితే కొన్నిసార్లు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినపుడు ఫైన్లు పడుతూ ఉంటాయి. కానీ వాహనాల కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయించుకోవాలంటే పొల్యూషన్ సర్టిఫికేట్ తప్పనిసరి అని తెలిపింది. ఒకవేళ సదరు వాహనానికి పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే భారీగా ఫైన్ విధించేందుకు సిద్ధమైంది. ఆ ఫైన్ కూడా రూ.10 వేలు అని వెల్లడించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15 వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల కాలుష్యాన్ని అరికట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వాహనాల్లో పెట్రోల్, డీజిల్ నింపడానికి కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ - పీయూసీని తనిఖీ చేయడం తప్పనిసరి అని పేర్కొంది. ఒక వేళ పీయూసీ లేకుండా వాహనం పెట్రోల్ బంకుకు వెళ్తే రూ. 10,000 చలాన్ విధించనున్నట్లు తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం.. ఆ రాష్ట్రంలోని 100 పెట్రోల్ పంపుల్లో పీయూసీ చెకింగ్ కోసం కెమెరాలు, సాఫ్ట్‌వేర్‌ను అమర్చాలని నిర్ణయించింది.
ఇందుకోసం ఓ ప్రైవేట్ కంపెనీకి టెండర్‌లను ఢిల్లీ రవాణ శాఖ ఇచ్చింది. నవగతి టెక్ కంపెనీ అనే సంస్థ 15 రోజుల్లోగా తన సేవలను ప్రారంభించాల్సి ఉంటుందని ఢిల్లీ సర్కార్ తెలిపింది. ఇకపై పెట్రోల్, డీజిల్ పోయించుకోవాలంటే పొల్యుషన్ సర్టిఫికేట్ తప్పనిసరి అని తెలిపింది. ఇందుకు సంబంధించి 15 రోజుల్లోగా పీయూసీ విచారణకు సిస్టం సిద్ధం చేయాలని నవగతి టెక్ కంపెనీని కోరామని.. దీని ఖరీదు రూ.6 కోట్లు ఉంటుందని రవాణా శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ కొత్త నిబంధన ప్రకారం.. పెట్రోల్ పంపులకు వచ్చే వాహనాలకు పీయూసీ లేకపోతే.. ఆ వాహనం పొల్యూషన్ చెక్ చేయనున్నారు. అయితే ఆ సమయంలోపు పీయూసీ చేయకపోతే ఆ వాహనానికి రూ. 10 వేలు ఈ-చలాన్ విధిస్తారు. పెట్రోల్ బంక్‌ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆటోమేటిక్‌గా ఫోటోలు తీసి.. సదరు వాహన యజమాని మొబైల్ నంబర్‌కు ఢిల్లీ రవాణా శాఖ పంపించనుంది.
సాధారణంగా ట్రాఫిక్ పోలీసులే ఈ పొల్యుషన్ సర్టిఫికేట్లను చెక్ చేస్తారు. అయితే ట్రాఫిక్ పోలీసులకు చిక్కకుండా కొందరు వాహనాదారులు తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెట్రోల్ బంకుల్లో అయితే.. ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా వస్తారని.. అప్పుడు పొల్యుషన్ సర్టిఫికేట్ లేకుంటే ఫైన్లు వేయవచ్చని ఢిల్లీ రవాణా శాఖ అధికారులు ఈ సరికొత్త ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయి.. కొన్ని సందర్భాల్లో స్కూల్స్‌లు, కాలేజీలు, ఆఫీసులకు సెలవులు ప్రకటించడం.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమనడం.. సరి-బేసి వాహనాలను నడపడం సహా భవననిర్మాణ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయడం లాంటి కఠిన ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అలాంటి పరిస్థితి రాకుండా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.