త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సౌరభ్ భరధ్వాజ్ అన్నారు. ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం పార్టీ శ్రేణులు, ఢిల్లీ ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. మనీష్ సిసోడియా నివాసంలో ఆదివారం పార్టీ నేతలతో కీలక భేటీ జరిగిందని తెలిపారు.సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని సౌరభ్ భరధ్వాజ్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని అంతకుముందు ఆ పార్టీ ఎంపీ సందీప్ పాఠక్ స్వాగతించారు.దేశ ప్రజాస్వామ్య వ్యవస్ధ సాధించిన విజయమని ఆయన పేర్కొన్నారు. సర్వోన్నత న్యాయస్ధానం మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ వెలువరించిన తీర్పు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని చెప్పారు. ఈ తరహా నియంతృత్వ పోకడలు చెల్లవని, వ్యవస్ధలను గుప్పిట్లో పెట్టుకుని ఎంతోకాలం సాగించలేరనేందుకు కోర్టు తీర్పు చెంపపెట్టు వంటిదని అన్నారు.