ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వం కూలిపోవడానికి కారణం అమెరికానే.. షేక్ హసీనా

international |  Suryaa Desk  | Published : Sun, Aug 11, 2024, 09:35 PM

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా సంచలన ఆరోపణలు గుప్పించారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం చోటు చేసుకున్న అస్థిరత, అల్లర్లు ఆందోళనలతోపాటు.. తన ప్రభుత్వం పడిపోవడానికి అమెరికా కారణం అని ఆమె ఆరోపించారు. అయితే అమెరికా ఈ దుస్సాహసానికి పాల్పడటానికి వెనుక ఒక బలమైన కారణం ఉందని తెలిపారు. బంగాళాఖాతంలో తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు వీలుగా ఉన్న సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని.. తాను అమెరికాకు అప్పగించనందునే అగ్రరాజ్యం ఇంతటి దుశ్చర్యకు పాల్పడిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఛాందసవాదుల మాటలు విని తప్పుదోవపట్టొద్దని ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రజలకు.. షేక్ హసీనా విజ్ఞప్తి చేశారు. ఆందోళనకారులు ఢాకాలోని తన అధికారిక నివాసాన్ని చుట్టుముట్టడంతో విధిలేని పరిస్థితుల్లో ఆర్మీ హెలికాప్టర్‌లో అక్కడి నుంచి వచ్చి.. భారత్‌లో తలదాచుకుంటున్న షేక్ హసీనాకు.. ఇతర దేశాల్లో ఆశ్రయం దొరక్కపోవడంతో ఢిల్లీలోనే ఉంటున్నారు.


బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తమ ప్రభుత్వ పతనానికి అమెరికానే కారణమని తాజాగా ఆరోపించారు. బంగాళాఖాతంలో అమెరికా ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుంటే దానికి.. బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న తాను అడ్డుకోవడంతోనే అమెరికా ఈ పన్నాగం పన్నినట్లు షేక్ హసీనా పేర్కొన్నారు. బంగాళాఖాతంలోని సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు తాను అప్పగించనందుకే ప్రధాని పదవి నుంచి తనను తప్పించారని ఆమె హసీనా ఆరోపించారు. ఛాందసవాదుల వల్ల బంగ్లాదేశ్ వాసులు తప్పుదోవ పట్టవద్దని.. శాంతంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు.


అయితే బంగ్లాదేశ్‌లో హింసను ఆపడానికే తాను.. అక్కడి నుంచి విదేశాలకు వచ్చినట్లు షేక్ హసీనా తెలిపారు. తాను బంగ్లాదేశ్ ప్రజల మృతదేహాలను చూడకుండా ఉండటానికి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు వివరించారు. బంగ్లాదశ్ విద్యార్థుల మృతదేహాలపై.. కొందరు అధికారంలోకి రావాలని కోరుకున్నారని.. కానీ దానికి తాను అంగీకరించలేదని షేక్ హసీనా స్పష్టం చేశారు. సెయింట్ మార్టిన్ దీవి సార్వభౌమాధికారాన్ని అమెరికాకు అప్పగించి బంగాళాఖాతంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు అనుమతి ఇచ్చి ఉంటే.. తాను బంగ్లాదేశ్‌ ప్రధాని పీఠంపై ఉండేదాన్నని.. కానీ తాను అలా చేయలేదని తన దేశ ప్రజలను అభ్యర్థిస్తున్నానని షేక్ హసీనా పేర్కొన్నారు.


తాను ఇంకా ఎక్కువ సేపు బంగ్లాదేశ్‌లో ఉంటే.. మరింత మంది ప్రాణాలు పోయేవని.. మరిన్ని దేశ వనరులు, ప్రజల ఆస్తులు దెబ్బతినేవని షేక్ హసీనా తెలిపారు. బంగ్లాదేశ్ ప్రజలు తనను ఎన్నుకున్నారని.. కాబట్టి వారికి తాను నాయకురాలిని అయ్యానని. వాళ్లే తన బలం అని చెప్పారు. తన పార్టీ అవామీ లీగ్‌కు చెందిన పలువురు నాయకులు హత్యకు గురయ్యారని, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని.. వాళ్ల ఇళ్లను తగులబెట్టారని వస్తున్న వార్తలు చూస్తుంటే తన గుండె రోదిస్తోందని చెప్పారు. అల్లా దయతో తాను త్వరలోనే బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని.. సవాళ్లతో పోరాడిన తర్వాత అవామీ లీగ్ పార్టీని మళ్లీ నిలబడేలా చేస్తానని షేక్ హసీనా హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్ భవిష్యత్తు కోసం తాను అల్లాను ప్రార్థిస్తున్నానని.. తన తండ్రి షేక్ ముజీబుర్ రెహ‌మాన్ కలలు కన్న దేశమన.. నా తండ్రితోపాటు కుటుంబ సభ్యులు ప్రాణాలు అర్పించిన దేశమని.. మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com