భార్యాభర్తలు అన్నాక గొడవలు, అలకలు సహజమే. కొన్నిసార్లు ఆలుమగలు గొడవపడి కొన్ని రోజులపాటు మాట్లాడుకోకుండా ఉంటారు. అయితే కొంతమంది ఇలాంటి చిన్న చిన్న గొడవలకే విడిపోతూ ఉంటారు. కానీ చాలా మంది తిరిగి కలిసిపోయి.. మునుపటిలాగే ఇద్దరూ కలిసి జీవిస్తారు. ఇక భార్యాభర్తల గొడవలు అనేవి ప్రతీ ఇంట్లోనూ సహజమే అనే మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన గురించి వింటే మాత్రం మీరు షాక్ అవుతారు. చిన్ని విషయంలో గొడవపడిన ఓ జంట.. చివరికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఆ భార్య అరెస్ట్ కాగా.. బెయిల్‌పై విడుదలైంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఇద్దరు భారతీయ దంపతుల మధ్య జరిగిన చిన్న గొడవే ఇది.
34 ఏళ్ల ఈషా పర్సాద్, శివ పర్సాద్ అనే దంపతులు ఫ్లోరిడాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం శివ పర్సాద్ పుట్టినరోజు కావడంతో వారిద్దరూ ఇంట్లోనే డిన్నర్ ఏర్పాటు చేసుకున్నారు. బయటినుంచి ఆర్డర్ చేసిన ఫుడ్‌ను తిందామని వారు సిద్ధమయ్యారు. అయితే మెక్ డొనాల్డ్స్ నుంచి బురిటో, సాఫ్ట్ షెల్ టాకో సహా ఇంకొన్ని రకాల ఫుడ్‌ను ఆర్డర్ చేసుకుని.. తెప్పించుకున్నారు. ఈ క్రమంలోనే ఫుడ్ విషయంలో వారిద్దరి మధ్య మనస్పర్దలు ఏర్పడ్డాయి. తనకు ఆ ఫుడ్ ఇష్టం లేదని శివ పర్సాద్.. ఈషా పర్సాద్‌కు చెప్పాడు. అయితే ఈ విషయంలోనే వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఈషా పర్సాద్.. తన చేతిలో ఉన్న బురిటో, సాఫ్ట్ షెల్ టాకోను భర్త శివ పర్సాద్‌పై విసిరినట్లు అతడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పినెల్లాస్ కౌంట్ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన సెయింట్ పీటర్స్‌బర్గ్ పోలీసులు.. వారి ఇంటికి చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించారు. తన పుట్టినరోజు సందర్భంగా మెక్‌డొనాల్డ్స్ నుంచి టాకో బెల్, బురిటోను ఆర్డర్ చేయడం గురించే వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. అయితే పర్సాద్ దంపతుల ఇంటికి పోలీసులు చేరుకునే సమయానికి శివ పర్సాద్ ముఖంపై బురిటో ఉన్నట్లు గుర్తించారు.
అయితే ఈ ఘటనలో అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే తన భర్త శివ పర్సాద్ ముందుగా తనపై బ్యాగ్ విసరడంతో తనకు తీవ్ర ఆగ్రహం వచ్చిందని.. అందుకే అతనిపై బురిటోను విసిరినట్లు ఈషా పర్సాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడి పరిస్థితులను గమనించిన పోలీసులు.. ఈషా పర్సాద్‌ను అరెస్ట్ చేసి.. పినెల్లాస్ కౌంటీ జైలుకు తరలించారు. అయితే అదే రోజు ఆమెకు బెయిల్ రావడంతో సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.