మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో కృష్ణా నదిపై ఉన్న డ్యామ్‌లు అన్ని నిండుకుండలా మారాయి. రెండు సంవత్సరాల తరువాత శ్రీశైలం జలాశయం కూడా పూర్తి స్థాయిలో నిండింది.ఈ క్రమంలో 14 రోజుల పాటు అధికారులు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలిపెట్టారు. ప్రస్తుతం జలాశయానికి ఇన్‌ఫ్లో తగ్గడంతో అధికారులు గేట్లను మూసివేశారు. గేట్లు ఎత్తిన సమయంలో వరద ఉధృతి అధికంగా ఉండంతో చేపల వేటను అధికారులు నిషేదించారు.
ఇప్పుడు గేట్లను మూసివేస్తున్నారు అనే సమాచారం అందడంతో చేపల వేటపై ఆధారపడిన మత్స్యకారులు పెద్ద సంఖ్యలో తమ తెప్పలను తీసుకుని డ్యామ్ వద్ద సిద్ధంగా ఉన్నారు. అధికారులు గేట్లను అలా మూశారో లేదో ఇలా వందల సంఖ్యలో మత్య్సకారులు తమ తెప్పలతో చేపల వేటకు బయలు దేరారు. పోటాపోటీగా చేపలను పడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శ్రీశైలం జలయాశానికి ఇన్‌ఫ్లో తగ్గడంతో రేడియల్ క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం 77,598 క్యూసెక్యుల ఇన్‌ఫ్లో ఉండగా 68,211 క్యూసెక్యులు ఔట్ ఫ్లోగా ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.20 అడుగుల నీరు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 194.3096 టీఎంసీలుగా ఉంది. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.