విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలో నిలబడటానికి కనీసం ఎన్టీఏ కూటమి నేతలకి అభ్యర్థి కూడా లేరని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అమర్నాథ్ విమర్శించారు. వారు భయపడే ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పుకున్నారని ఆరోపించారు. తమ పార్టీ నుంచి వెళ్లిన కార్పొరేటర్లు మహాత్మ గాంధీలు కాదని చెప్పారు. సుమారు రెండు నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న దాడులను ప్రజలందరు చూస్తున్నారని అమర్నాథ్ తెలిపారు. ఎండాడ వైసీపీ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అమర్నాథ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ.. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చి వేడుకలు జరుపుకుంటున్నామని.. కానీ ఆంధ్రలో మాత్రం స్వాతంత్య్రం పోయి సుమారు రెండు నెలలు పూర్తి అయిందని అన్నారు. ఇప్పటివరకు సుమారు 30కు పైగా వైపీపీ కార్యకర్తలు హత్య చేయబడ్డారని ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వానికి కాస్త సమయాన్ని తాము ఇస్తున్నామని.. వారు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ అమలు చేయాలని అమర్నాథ్ అన్నారు. అసెంబ్లీ సాక్షిగా కూటమి నేతల మాటలను ప్రజలంతా చూస్తున్నారని చెప్పారు. విశాఖలో కొద్ది రోజుల క్రితమే రెండు కంపెనీలు వెళ్లిపోయాయని ఆరోపించారు. భోగాపురం విమానాశ్రయం తాము శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు. 16 మెడికల్ కళాశాలలు, పోర్టులు ఇలా చాలా అభివృద్ధి కార్యక్రమాలకు తాము శంకుస్థాపనలు చేశామని అమర్నాథ్ పేర్కొన్నారు.