ఏపీవాసులకు బంపరాఫర్.. త్వరలోనే మీరు సరికొత్త అనుభూతిని పొందొచ్చు. నీటిపై తేలుతూ, గాల్లో విహరిస్తూ.. నేలపై తిరుగుతూ ఇలా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో సీ ప్లేన్స్ తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విషయాన్ని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వయంగా వెల్లడించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు శనివారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో చర్చించారు. ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై ఆయనతో చర్చించారు. చంద్రబాబుతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి పలు కీలక వివరాలు వెల్లడించారు.
వచ్చే వారంలో రోజుల్లో సీ ప్లేన్ విధానాన్ని విడుదల చేస్తామన్న రామ్మోహన్ నాయుడు.. ప్రకాశం జిల్లాలో, శ్రీశైలంలో ఎయిర్‌డ్రోమ్స్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించిందన్న రామ్మోహన్ నాయుడు.. సీ ప్లేన్ విధానాన్ని ఏపీ అద్భుతంగా ఉపయోగించుకోవచ్చన్నారు. ఇక సీ ప్లేన్ విషయానికి వస్తే ఇవి గాల్లో ఎగరగలవు, నీటిపై తేలగలవు. అలాగే ఎక్కడైనా ల్యాండ్ అయ్యే కెపాసిటీ ఈ సీ ప్లేన్లకు ఉంటుంది. ఇక అమెరికా, మాల్దీవులు వంటి దేశాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి ఇవి ఎంతగానో తోడ్పడుతున్నాయి. ఏపీలో తీర ప్రాంతం అధికంగా ఉన్న నేపథ్యంలో పర్యాటకంగా ఈ సీ ప్లేన్లను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
టూరిజం పరంగానే కాకుండా విపత్తుల సమయంలో, మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర సీ ప్లేన్ విధానాన్ని ప్రవేశపెట్టిన వెంటనే దానిని ఏపీలో అమలు చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రతిపాదనకు వెంటనే అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ప్రకాశం జిల్లా , శ్రీశైలంలో త్వరలోనే సీ ప్లేన్లను చూసే అవకాశంతో పాటుగా విహరించే ఛాన్స్ కూడా ఉంటుంది.
మరోవైపు గత వైసీపీ ప్రభుత్వం హయాంలోనూ సీ ప్లేన్లు తీసుకురావాలని అప్పట్లో ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు ప్రణాళికలు రచించారు. తొలి దశలో భాగంగా విజయవాడ- కాకినాడ, రుషికొండ - లంబసింగి, కాకినాడ - రుషికొండ, రుషికొండ - కోనసీమ, కోనసీమ - విశాఖపట్నం ప్రాంతాల మధ్య సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి తేవాలని ప్లాన్ చేశారు. ఈ ప్రాంతాలను కేవలం 40 నిమిషాల్లో చుట్టేసేలా ప్రణాళికలు రచించారు. అయితే అమలు దిశగా ఆ ప్రతిపాదనలు ముందడుగు పడలేదు.