కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన గత 15 రోజులుగా దేశం మొత్తాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న వేళ.. ఇలాంటి ఘటనలు, లైంగిక వేధింపుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలె మహారాష్ట్ర థానేలో ఇద్దరు 4 ఏళ్ల బాలికలపై బాత్రూంలోనే స్వీపర్ లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటన.. నగరంలో భారీ నిరసనలు, ఆందోళనలకు కారణం అయింది. తాజాగా అదే మహారాష్ట్రలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ పాఠశాలలోని ఆరుగురు బాలికలకు పోర్న్ వీడియోలు చూపించిన ఓ కీచక టీచర్.. అనంతరం వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే గత 4 నెలలుగా ఆ టీచర్.. బాలికల పట్ల ఇలాగే ప్రవర్తిస్తున్నాడనే విషయం తాజాగా వెలుగులోకి రావడంతో తీవ్ర సంచలనంగా మారింది.
మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్.. అది మానేసి.. వారికి పోర్న్ వీడియోలు చూపించి.. వేధింపులకు దిగిన ఘటన సంచలనంగా మారింది. ఆ పాఠశాలలోని ఆరుగురు బాలికలకు.. అశ్లీల వీడియోలు చూపించిన ఆ ఉపాధ్యాయుడు.. వారిపై లైంగిక వేధింపులకు దిగినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే ఈ తంతు గత 4 నెలలుగా జరుగుతోందని తెలుస్తోంది. ఆ కీచక టీచర్ వేధింపులకు తాళలేని ఆ బాలికలు.. చివరికి బాలల సంక్షేమ కమిటీ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఆ అమ్మాయిల ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న బాలల సంక్షేమ కమిటీ.. రంగంలోకి దిగి పోలీసులను పురమాయించింది. బాలల సంక్షేమ కమిటీ సభ్యులు.. మంగళవారం అకోలాలోని ఆ పాఠశాలను సందర్శించి.. అక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు. ఆ తర్వాత ఆ ఉపాధ్యాయుడిపై లైంగిక వేధింపుల కింద అభియోగాలు నమోదు చేసి కేసు పెట్టారు. ఆ వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. విచారణ చేస్తున్నారు.
మరోవైపు.. మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపుర్ పట్టణంలోని ఓ స్కూల్‌లో 3, 4 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు బాలికలపై.. ఆ పాఠశాలలో స్వీపర్‌గా పనిచేసే ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడటం.. బద్లాపూర్ పట్టణాన్ని రణరంగంగా మార్చింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు.. వందల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి మంగళవారం తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు.
సదరు పాఠశాలను ధ్వంసం చేసిన నిరసనకారులు.. బద్లాపుర్ రైల్వేస్టేషన్‌పై రాళ్ల దాడి చేశారు. అంతటితో ఆగకుండా పట్టాలపై బైఠాయించడంతో ఆ మార్గంలో 7 గంటలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పలు రైళ్లు రద్దయ్యాయి. కొన్నింటిని దారి మళ్లించారు. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపైనా రాళ్లు విసరడంతో పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు.. నిరసనకారులపై లాఠీఛార్జ్ చేశారు. బాధిత బాలికలకు న్యాయం చేయాలని.. నిందితుడిని ఉరి తీయాల్సిందేనని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.