కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇక బెంగాల్ అయితే విషయంలో అట్టుడికిపోతోంది. ఈ కేసు విచారణ బాధ్యతను మమతా బెనర్జీ సర్కారు సీబీఐకి అప్పగించింది. ఆర్జీ కర్ హాస్పిటల్‌లో వైద్యురాలిని దారుణంగా రేప్ చేసి హతమార్చిన వారికి మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ.. దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. సినీ నటి, మాజీ ఎంపీ మిమీ చక్రబర్తితోపాటు రిద్దీ సేన్, అరిందమ్ సిల్, మధుమిత సర్కారు తదితరులు కోల్‌కతాలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.
ఈ నిరసన ప్రదర్శనల్లో భాగమైనందుకు గానూ.. తనను రేప్ చేస్తానని సోషల్ మీడియా ద్వారా బెదిరిస్తు్న్నారని టీఎంసీ మాజీ ఎంపీ మిమీ చక్రబర్తి ఆరోపించారు. ఈ బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘మహిళలకు న్యాయం చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం కదా..? విషపూరితమైన పురుషులు.. పైకి మాత్రం మహిళలకు అండగా నిలుస్తున్నామని చెబుతున్నారు. కానీ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు రేప్ చేస్తామని బెదిరిస్తున్నారు. నాకు వచ్చిన బెదిరింపుల్లో ఇవి కొన్ని. ఎలాంటి పెంపకం, చదువు దీన్ని సమ్మతిస్తాయో మరి?’’ అని మిమీ చక్రబర్తి ఎక్స్‌లో రాసుకొచ్చారు.
రేప్ బెదిరింపులు వచ్చాయని మిమీ చక్రబర్తి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ‘‘ఓ మాజీ ఎంపీని రేప్ చేస్తామని బెదిరిస్తున్నారు. మహిళలు పరిస్థితి ఎంత దుర్బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహిళలకు భద్రత కల్పించడం కోసం వెంటనే చర్యలు తీసుకోండి’’ అని డిమాండ్ చేస్తూ.. టీఎంసీ సోషల్ మీడియా సెల్ బెంగాల్ జనరల్ సెక్రటరీ నిలంజన్ దాస్ కోల్‌కతా సైబర్ క్రైమ్ డీసీపీని కోరారు.
కోల్‌కతా పోలీసులు ఆందోళనల్లో పాల్గొంటున్న కాలేజీ విద్యార్థులను అరెస్ట్ చేయడంలో చాలా బిజీగా ఉన్నారంటూ మరో నెటిజన్ సెటైరికల్‌గా కామెంట్ చేశారు. ఇక మిమీ చక్రబర్తి విషయానికి వస్తే.. బెంగాల్ నటి అయిన ఆమె 2019-24 మధ్య జాదవ్‌పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2016, 2020ల్లో కలకత్తా టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ జాబితాలో ఆమె చోటు సంపాదించారు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత నటిగా మారారు. ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో మిమీ చక్రబర్తి పాల్గొన్నారు. 2019లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె టీఎంసీ నుంచి ఎంపీగా గెలిచారు. 2024 ఫిబ్రవరిలో.. ఎన్నికల ముంగిట మిమీ చక్రబర్తి ఎంపీ పదవికి రాజీనామా చేశారు.