విమానాలు రకరకాల కారణాల వల్ల రద్దు అవుతూ ఉంటాయి. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తూ ఉంటాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి.. ఒక దేశం నుంచి మరో దేశానికి వేగంగా వెళ్లేందుకు ప్రజలు.. ఈ విమానాలను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో విమానాలు క్యాన్సిల్ కావడం, ఆలస్యం కావడంతో.. వారి పనులకు ఆటంకం కలుగుతుంది. వాతావరణం సహకరించకపోవడం, విమానాల్లో సాంకేతిక లోపం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి రాకపోవడం వల్ల సాధారణంగా విమానాలు రద్దు కానీ, ఆలస్యం కానీ అవుతాయి. అయితే ఇక్కడ మాత్రం ఒక కత్తెర కారణంగా విమానాలు రద్దు, ఆలస్యం కావడం తీవ్ర చర్చకు దారి తీసింది.
జపాన్‌లోనే అత్యంత రద్దీగా ఉండే న్యూ చిటోస్ ఎయిర్‌పోర్టులో ఈ సంఘటన చోటు చేసుకుంది. హక్కైడో ద్వీపంలో ఉన్న ఈ న్యూ చిటోస్ విమానాశ్రయంలో ఉన్న ఓ రిటైల్ స్టోర్‌లో ఉన్న ఓ కత్తెర ఆగస్ట్ 17 వ తేదీన కనిపించకుండా పోయింది. దీంతో ఆ రిటైల్ స్టోర్ యజమాని.. ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అలర్ట్ అయిన ఎయిర్‌పోర్టు అధికారులు.. ప్రయాణికులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఎయిర్‌పోర్టు మొత్తం ఆ కత్తెర కోసం జల్లెడ పట్టారు. విమానాలు ఎక్కేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చే ప్రయాణికుల భద్రతా తనిఖీలను ఆపేసి మరీ.. దాదాపు 2 గంటల పాటు ఆ కత్తెర కోసం అణువణువునా గాలింపు చేపట్టారు. దీంతో ఆ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన 36 విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. అదే సమయంలో మరో 201 విమానాలు.. షెడ్యూల్ కంటే ఆలస్యంగా బయల్దేరాయి.
ఈ క్రమంలోనే ఈ ఘటనపై న్యూ చిటోస్ ఎయిర్‌పోర్టు అధికారులు స్పందించారు. ఎయిర్‌పోర్టులోని రిటైల్ స్టోర్‌లో కత్తెర కనిపించకుండా పోవడంతో.. ప్రయాణికుల భద్రత నేపథ్యంలోనే ఎయిర్‌పోర్టు మొత్తం ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఎవరైనా ఉగ్రవాదులు.. ఆ కత్తెరను ఎత్తుకెళ్లి.. దానితో బెదిరించి.. విమానాలను హైజాక్ చేసే అవకాశాలు ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఈ సంఘటనలో అసలు ట్విస్ట్ ఏంటంటే.. కనిపించకుండా పోయిన ఆ కత్తెర చివరకు.. అదే రిటైల్ స్టోర్ కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఆ రిటైల్ స్టోర్‌లో మేనేజ్‌మెంట్ వ్యవస్థ సరిగా లేకపోవడంతోనే ఇలాంటి ఘటన జరిగిందని.. ఎయిర్‌పోర్టు అధికారులు చివరికి తేల్చారు.
అయితే ఈ విషయం తెలుసుకుని ఆ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రయాణికులు అవాక్కయ్యారు. ఈ ఘటన కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విమానాలు ఆలస్యం కావడంతో చాలా మంది ప్రయాణికులు గంటల తరబడి అదే న్యూ చిటోస్ ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఇక కొందరు ప్రయాణికులు.. చేసేదేం లేక తిరిగి వెళ్లిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఎయిర్‌పోర్టు అధికారులకు జపాన్ రవాణా మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. 1988లో ప్రారంభం అయిన ఈ న్యూ చిటోస్ ఎయిర్‌పోర్ట్.. హక్కైడో ద్వీపంలోనే అతిపెద్దది కావడం గమనార్హం. జపాన్‌లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఇది ఒకటి. ఈ ఎయిర్‌పోర్టులో భద్రతాపరంగా కఠినమైన ప్రొటోకాల్స్ ఉంటాయి.