వైయస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. రెంటచింతల, కారంపూడిలో నమోదైన కేసుల్లో బెయిల్ రావడంతో ఆయన శనివారం ఉదయం జైలు నుంచి బయటకు వచ్చారు. అక్రమ కేసుల కారణంగా పిన్నెల్లి 55 రోజుల పాటు జైలులో ఉన్న ఉండాల్సి వచ్చింది. పిన్నెల్లి బయటకు వస్తున్న నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..‘హైకోర్టు ఉత్తర్వుల మేరకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విడుదల చేశారు. ప్రజలకు సంబంధించిన వ్యక్తిపై వివిధ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. వరుసగా నాలుగు సార్లు ఆయన మాచర్ల నుంచి విజయం సాధించారు. అలాంటి వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం దుర్మార్గం. చంద్రబాబును విమర్శించిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే మేము భయపడం. పిన్నెల్లి ఏం నేరం చేశారని దాదాపు రెండు నెలలు జైల్లో పెట్టారు.చాలాచోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు. కానీ, పిన్నెల్లిపై మాత్రమే కేసు పెట్టారు. అందుకే ఆయనపై ప్రజల్లో సానుభూతి ఉంది. చంద్రబాబు ఇలానే ప్రవర్తిస్తే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు.. సన్నిహితులు.. శ్రేయోభిలాషులు అందరూ తల్లడిల్లిపోయారు. ఏది ఏమైనా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుని కోరుకుంటున్నాం. పిన్నెల్లిపై మరిన్ని కేసులు నమోదు చేసి మళ్లీ జైలుకు పంపించాలని ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ఈ విధంగా చేస్తే భవిష్యత్తులో అవన్నీ మళ్ళీ పునరావృతమవుతాయి. ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. చంద్రబాబు చెప్పినట్లు చేస్తే అధికారులు బలి అవుతతారు. అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలి. చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోతే ఆయన, లోకేశ్‌తో హైదరాబాద్‌కు వెళ్ళిపోయారు. అధికారులు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. వంద రోజుల్లో మంచి పాలన అందిస్తానని చెప్పిన చంద్రబాబును ప్రజలు ఛీ కొడుతున్నారు. చంద్రబాబు పాలన చూసి ప్రజలు ఛీ కొడుతున్నారు. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి. కేసులకు, అరెస్ట్‌లకు భయపడే ప్రసక్తే లేదు అంటూ కాకాణి గోవర్ధన్‌రెడ్డి కామెంట్స్ చేశారు.