సులువుగా దొంగతనాలు చేసేందుకు అనువుగా ఉన్న ఏటీఎం కేంద్రాలే టార్గె ట్. అర్ధరాత్రి 2 నుంచి తెల్లవారు జామున 4 గంటల మధ్యలో వస్తారు. ముఖాలకు ముసుగులు ధరించి గ్యాస్ కట్టర్‌తో మిషన్‌ను కట్ చేసి చోరీ చేస్తారు. ఇలా అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటు కర్ణాటకలో దాదాపు రూ.కోటి దోచుకున్నారు. చివరకు అనంతపురం జిల్లా పోలీసులు శనివారం ఈ ముఠాను అరెస్ట్ చేశారు. హరియాణాకు చెందిన 12 మంది దొంగల ముఠాలో పోలీసులు ఐదుగుర్ని అరెస్ట్ చేయగా, మరో ఏడుగురు పరారీలో ఉన్నారు. దొంగల నుంచి 2 లక్షల నగదు మాత్రమే రికవరీ చేశారు. ఈ ముఠాను పట్టుకునేందుకు అనంతపురం నగరంలోని నాలుగు పోలీస్‌స్టేషన్ల సీఐలు, సీసీఎస్, స్పెషల్ బ్రాంచ్, టెక్నికల్ స్టాఫ్, కర్ణాటక పోలీసులు శ్రమించారు. ఈ నెల 8న అనంతపురం నగరంలోని రామ్‌నగర్ ఎస్‌బీఐ ఏటీఎంలో దొంగలు రూ.29.80 లక్షలను ఎత్తుకెళ్లారు. ఈ నెల 2న కల్లూరు ఎస్బీఐ ఏటీఎంలో రూ.3,26,600, జూన్ 7న కూడేరు మండల కేంద్రంలోని ఏటీఎంలలో రూ.18,41,300 చోరీ చేశారు. కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో ఏటీఎం సెంటర్లో రూ.18,24,500 చోరీ చేశారు. చిత్తూరు జిల్లా గుడిపాల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఏటీఎం సెంటర్లో రూ.25,98,400 చోరీ చేశారు. నిందితుల నుంచి గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్, 5 సెల్‌ఫోన్లు, 3 ఇనుప రాడ్లు, ఒక బాకు, కారం పొడి ప్యాకెట్, శానిటైజర్ స్ర్పే బాటిల్, పెయింట్ స్ర్పేలు, ఒక లారీని స్వాధీనం చేసుకున్నారు.