ఫార్మా కంపెనీల్లో జరుగుతున్న ప్రమాదాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. పరవాడ ఫార్మాసిటీలోని ‘సినర్జిన్’ కంపెనీలో గురువారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో గాయపడి ఇండస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని శనివారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో రామకృష్ణ మాట్లాడుతూ.... ఈ ప్రమాదాలకు యాజమాన్యాలతో లాలూచీపడిన అధికారులు బాధ్యత వహించాలన్నారు. ఫార్మా కంపెనీలలో సరైన భద్రతా చర్యలు, కార్మికులకు శిక్షణ సౌకర్యాలు లేవని అందువల్లే ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఇవి ప్రమాదాలు కావని, యాజమాన్యాలు చేసిన హత్యలని వారిపై కేసు నమోదుచేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ఫార్మా కంపెనీల్లో తనిఖీలు నిర్వహించి లోపాలు ఉన్నట్టయితే లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఫార్మా కంపెనీలలో నెలకొన్న పరిస్థితులపై చర్చ జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, వి.విమల ఎస్‌కే రహమాన్ పి.చంద్రశేఖర్, మన్మథరావు క్షేత్రపాల్ తదితరులు పాల్గొన్నారు.