ప్రేమించిన వాడితో పారిపోయి పెళ్లి చేసుకునేందుకు సహకారం అదించాడనే కోపంతో యువతి బంధువులు మందపాటి రాజు, అతని కుటుంబ సభ్యులపై సుమారు 40 మంది మూకుమ్మడిగా కర్రలతో దాడి చేసిన ఘటన జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలో శనివారం సంచలనం రేపింది. జంగారెడ్డి గూడెం మండలం అక్కంపేటకి చెందిన పారేపల్లి జాహ్నవి, ఆమె ఇంటి పక్కనే ఉంటున్న గణేష్‌లు ప్రేమించున్నారు. వీరిద్దరిది ఒకే సామాజిక వర్గం. గత ఆగస్టు 15న ఇద్దరూ ఇంటి నుంచి వెళ్ళిపోయి భద్రాచలం రాముడి సన్నిధిలో పెళ్లి చేసుకున్నారు. అయితే తమ కుమార్తెకు గణేష్‌తో వివాహం చేయడంలో గణేష్‌కు వరుసకు బావ అయిన మంద పాటి రాజు మధ్యవర్తిగా వ్యవహరించాడన్న అనుమానంతో శనివారం మైసన్నగూడెం గ్రామానికి సుమారు నలభై మంది ద్విచక్ర వాహనాలు, కార్లతో రాజు ఇంటికి వెళ్లారు. జాహ్నవి ఎక్కడుందో చెప్పాలంటూ నాగార్జున, కొప్పుల శ్రీను, మణికే నాగేశ్వరరావు, బల్లే విజయ్, నులకాని నాగబాబు మరికొంతమంది రాజు, అతని తల్లి కనకదుర్గ, గణేష్ తల్లి శశిరేఖలపై దాడి చేసి కర్రలతో కొట్టారని బాధితులు తెలిపారు. కనక దుర్గపై బాటిళ్ళతో తెచ్చుకున్న పెట్రోలు పోసి చంపుతామని బెదిరించారని తమ కారును కూడా ధ్వంసం చేశారని బాధితుడు రాజు తెలిపాడు. గ్రామస్థులు అడ్డుకుని గాయపడిన ముగ్గురిని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే రాజు అతని కుటుంబ సభ్యులపై జరిగిన దాడిని తెలుసుకున్న గణేష్, జాహ్నవి ఒక వీడియోను వాట్సప్‌లో పోస్ట్ చేశారు. ‘‘తమ వివాహం ఇష్ట ప్రకారం జరిగిందని మా గురించి ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని’’ పురుగుమందు డబ్బా పట్టుకుని ఆత్మహత్యాప్రయత్నం చేశారు. ఆసుపత్రిలో బాధితులను డీఎస్పీ రవిచంద్ర పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు..ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి సర్పంచ్ నాగేంద్రతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఆసుపత్రి వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ రాజేష్, ఎస్‌ఐ షేక్ జబీర్ పర్యవేక్షించారు.