ప్రజలకు ఆరోగ్యం, స్వచ్ఛమైన తాగు నీరందించే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి ఆమె ‘ప్రజల ఆరోగ్యం, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా’పై సమీక్షించారు. ‘సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో 28 రోజుల్లోపు నవజాత శిశు మరణాలు.. నాలుగు నెలల్లో 26 మంది చనిపోవడం బాధాకరం. ఇటీవల ఆలమూరు పీహెచ్‌సీ పరిధిలో ఎక్కువగా జ్వరం కేసులు నమోదవుతున్నాయి. ఇంటింటా ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలి. ఎవరికైనా జ్వరం ఉన్నట్లు గుర్తిస్తే వారికి పరీక్షల నిర్వహించి వెంటనే వైద్య సాయం అందించాలి. గత ఏడాది డెంగ్యూ కేసులు వచ్చిన ప్రాంతాల్లో మెడికల్ ఆఫీసర్లు, ఎంపీహెచ్‌ఏ, ఏఎన్‌ఎంలు ముందస్తు చర్యలు చేపట్టాలి. టీబీ కేసులో నమోదైన రోగులు టాబ్లెట్స్ వినియో గిస్తున్నారా ? మంచి ఆహారం తీసుకుంటున్నారా ? సంబంధిత సిబ్బంది ఆరా తీయాలి. జిల్లాలో స్వచ్ఛమైన తాగు నీరందించేందుకు మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు, ఈవోపీఆర్డీలు నిరంతరాయంగా పనిచేయాలి. సమీక్షలో డీఎంహెచ్‌వో డాక్టర్ డి.మహేశ్వరరావు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారి నాగేశ్వరరావు, డీపీవో విక్టర్, తదితరులు పాల్గొన్నారు.