రాజమహేంద్రవరంలో కార్పొరేషన్ కు చెందిన ఖాళీ స్థలాలను పార్కులుగా అభివృద్ధి చేస్తామని కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. శనివారం నగరంలో కార్పొరేషన్ ఖాళీ స్థలాలను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఆహ్లాద వాతావరణాన్ని కల్పించడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించడానికి కృషి చేస్తున్నామన్నారు. నగరంలో పార్కులను అభివృద్ధి చేయడంలో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం తీసుకుంటామన్నారు. అలాగే నిర్వహణ బాధ్యతలు వారికి అప్పగిస్తామన్నారు. అందుకు అనుగుణంగా తగిన ప్రతిపాదనలు తయారు చేస్తామన్నారు. గతంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణ వ్యర్ధాలు తరలింపు జరిగేదని, అందుకు రుసుము కూడా నిర్ణయించారని, అయితే కొద్ది కాలం నుంచి ఆ ప్రక్రియ జరగడంలేదన్నారు. తిరిగి వ్యర్ధాల తొలగింపు కార్యక్రమం చేపడతామన్నారు. నగరంలోని నిర్మాణ వ్యర్ధాలను విడదీయడానికి వీరభద్రనగర్‌లో ఉన్న కార్పొరేషన్‌కు చెందిన స్లాటర్ హౌస్‌లో ప్లాంట్ ఏర్పా టు చేస్తామన్నారు. అందుకు తగిన ప్రతిపాదనలు తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను అదేశించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ జి.పాండురంగారావు, ఎంహెచ్‌వో డాక్టర్ వినూత్న, ఈఈ మదర్షాఆలీ, డిప్యూటీ సిటీ ప్లానర్ బాలాజీ, ఏఈ, శానిటరీ సూపర్‌వైజర్ రామలింగారెడ్డి పాల్గొన్నారు.