ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాలకు మళ్లీ పునర్వైభవం రానుంది. గత ఐదేళ్లుగా నిర్లక్ష్యానికి, నిరాధరణకు గురైన ఆలయాలు ఇప్పుడు మళ్లీ పునరుజ్జీవం పోసుకోనున్నాయి. సీఎం చంద్రబాబు పాలనలో ఆలయాలకు మహర్ధశ పట్టనుంది. అవును, తాజాగా దేవాదాయ శాఖపై చేపట్టిన సమీక్షలో సీఎం చంద్రబాబు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేవాలయల సంరక్షణ, అభివృద్ధిపై అవసరమైన చర్యలకు పూనుకున్నారు. మంగళవారం నాడు దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సంబంధిత శాఖ మంత్రి, అధికారులు ఈ సమీక్షకు హాజరవగా.. సీఎం కీలక సూచనలు చేశారు. దేవాలయాల్లో ఆధ్యాత్మిక వెల్లివిరవాలి.. అపచారాలకు చోటు ఉండకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులు, అన్యమనస్థులు రాకూడదన్నారు. భక్తుల మనోభావాలకు, ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. రిలీజియస్ టూరిజం ప్రమోషన్ కోసం ఎండో, ఫారెస్ట్, టూరిజం మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. అలాగే.. దేవాలయాల ట్రస్ట్ బోర్డులో అదనంగా మరో ఇద్దరికి అవకాశం కల్పించాలన్నారు.