ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పినా వైసీపీలో ఇంకా మార్పు రావడం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి విమర్శించారు. ఈ ఘోర ఓటమిని వైసీపీ ఇంకా జీర్ణించుకోలేకపోతోందన్నారు. వైసీపీ అరాచక పాలనను దించడానికి ప్రజలు కూటమికి ఓట్లు వేశారని పేర్కొన్నారు. ప్రజలు వేసిన ఓట్లపై వైసీపీకి అనుమానం అంటే.. ప్రజలను అనుమానించినట్లేనని అన్నారు. మంగళవారం నాడు పురంధేశ్వరి నివాసంలో బీజేపీ ముఖ్యనేతలు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం, వైసీపీ స్థానాన్ని ఆక్రమించేలా ప్రణాళికలు రచించే అంశంపై చర్చించారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పురంధేశ్వరి.. వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ‘వైసీపీ ఓటమిని ఇంకా జీర్ణించుకోలేక పోతుంది.. ఆ పార్టీ అరాచక పాలనను దించడానికి ప్రజలు కూటమికి ఓట్లు వేశారు. ప్రజలు వేసిన ఓట్లపై వైసీపీకి అనుమానం అంటే ప్రజల్ని అనుమానించినట్టే’ అని అన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం అవసరమైన కార్యక్రమాలు చేపడతామన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేస్తామన్నారు. గతం కంటే ఎక్కువగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందన్నారు. సభ్యత్వంపై కోర్ గ్రూప్‌తో ఇప్పటికీ సమీక్ష జరిగిందని పురంధేశ్వరి చెప్పారు. భవిష్యత్ కార్యాచరణపై సీఎంతో చర్చించామన్నారు. కూటమి పార్టీలు సమన్వయంతో ముందుకెళ్లాలని సీఎంతో చర్చించామని పురంధేశ్వరి చెప్పారు. మూడు పార్టీల కార్యకర్తలు కష్టపడి పని చేశారని.. అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సమన్వయంతో పని చెయ్యాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసారు.