ముంబై నటికి వైసీపీ టార్చర్ కథనాలపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. ముంబై నటిని వైసీపీ ప్రైవేటు గెస్ట్ హౌస్‌లో విచారణను పోలీసులే చేశారా లేక సజ్జల చేశారా అనేది విచారణలో తేలాలని అన్నారు. ముంబై నటిని విజయవాడ తీసుకొచ్చాక ఖచ్చితంగా సజ్జల ఆమె వద్దకు వెళ్లి ఉంటారని సందేహాలు వ్యక్తం చేశారు. ఆ నటిని మానసికంగా, ఇంకోరకంగా హింసించేందుకు సజ్జల వేసిన హనీ ట్రాప్ ఇది అని వర్ల రామయ్య విమర్శించారు. ముద్దాయిని పట్టుకొచ్చేలా పోలీసులు వ్యవహరించలేదని, సజ్జల హనీ ట్రాప్‌ను నెరవేర్చే మాదిరిగానే వీరి వ్యవహారం ఉందని అనుమానం వర్ల రామయ్య అనుమానం వ్యక్తం చేశారు. సజ్జల నాయకత్వం వహించిన బూతు భాగోతం కుట్ర ప్రజలందరికీ అర్థమైందని, సజ్జల తాపేదార్లగా కాంతీ రాణా, విశాల్ గన్నీ వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు డీజీ స్థాయి అధికారితో కేసుపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని అన్నారు. జగన్ హయాంలో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ దుర్వినియోగం అయినట్లుగా మరెక్కడా కాలేదని అన్నారు. ఓ 420 కేసులో నిందితురాలు కోసం అంతర్జాతీయ తీవ్రవాదిని పట్టుకోవటానికి వెళ్లినట్లు పోలీసులు విమానంలో వెళ్లారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జుగుప్సాకరమైన ఒక చెత్త కేసు సజ్జల జోక్యంతో ప్రాధాన్య కేసుగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పోలీసు వ్యవస్థ కాబట్టే బాధితురాలు కాస్తా నిందితురాలుగా మారిందని విచారం వ్యక్తం చేశారు. ఓ అంతర్జాతీయ క్రిమినల్‌ని పట్టుకోవాల్సి వస్తే ఇవ్వాల్సిన ప్రాధాన్యత.. ఓ అమాయకురాలిని తీసుకొచ్చేందుకు ఇస్తారా? అని నాటి ప్రభుత్వాన్ని వర్ల రామయ్య ప్రశ్నించారు. వైసీపీలో దరిద్రం నంబర్ 1 గోరంట్ల మాధవ్ అయితే, దరిద్రం నెంబర్2 ఆనంతబాబు, అయితే తాజా ముంబై నటి ఘటన దరిద్రం నెంబర్3గా మారిందని విమర్శల దాడి చేశారు.