ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష వైసీపీకి వరసగా షాకులు తగులుతున్నాయి. ఏలూరు మేయర్ దంపతులు వైసీపీని వీడారు. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులకు లోకేశ్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మేయర్ దంపతులతోపాటు ఈయూడీఏ మాజీ చైర్మన్, వైసీపీ పట్టణ అధ్యక్షులు బీ శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ మంచం మైబాబు పలువురు వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీని ప్రజలు తిరస్కరించారని మంత్రి నారా లోకేశ్ గుర్తుచేశారు. అయినప్పటికీ ఆ పార్టీకి గుణపాఠం రాలేదని, బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ కాలం వెళ్లదీస్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఏలూరు అభివృద్ధి కోసం కలిసి వచ్చేవారికి స్నేహ హస్తం అందిస్తామని స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి అభిప్రాయ పడ్డారు. వైసీపీ కార్యకర్తలను వదిలేసి, పార్టీకి రాజీనామా చేసి ఆళ్ల నాని వెళ్లిపోయారని గుర్తుచేశారు. ఏలూరు అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేవారిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. దశల వారీగా కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని వివరించారు.