జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఏర్పాటు చేస్తున్న బైపాస్ రోడ్డు కింద మురుగు తూరలు ఏర్పాటు చేయాలని స్థానిక నాయకులు, రైతులు మంగళవారం మామిడికుదురులోని బైపాస్ రోడ్డు వద్ద నిరసన తెలిపారు. సరైన ప్రాంతంలో మురుగు తూరలు ఏర్పాటు చేయకపోవడంవల్ల ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరిచేలు నీట మునిగాయని రైతులు ఆరోపించారు. జాతీయరహదారిపై సరైన అవగాహన లేకుండా ఇష్టారాజ్యంగా అవసరమైనచోట కాకుండా అక్కడక్కడా తూరలు పెట్టి చేతులు దులుపుకున్నారని, దీనివల్ల పల్లపు చేలల్లోని మురుగునీరు బయటకు పోవడంలేని రైతులు పేర్కొన్నారు. మామిడికుదురు నుంచి నగరం వరకు ఆరు మురుగు బోదెలు ఉన్నాయని, ఆయా చోట్ల తూరలు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. వర్షం వస్తే మురుగునీరంతా దిగేలా అనువైనచోట్ల మురుగుతూరలు ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామంలోని మురుగునీరు దిగేందుకు అనువుగా రోడ్డులో తూరలు ఏర్పాటుచేయాలని స్థానిక సర్పంచ్ గౌస్ మొహిద్దీన్ (బాబు) కోరారు. దీనిపై గతంలో ఎమ్మెల్యే ద్వారా ఎన్‌హెచ్ అధికారులకు విజ్ఞాపన పత్రం అందించినప్పటికీ తూరలు పెట్టలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అవసరమైన మురుగుతూరలు ఏర్పాటుచేసి భవిష్యత్తులో డ్రెయిన్ సమస్య లేకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఈలి శ్రీనివాస్, రుద్ర శ్రీను, నయినాల సత్యంమూర్తి, సాపే ఏకాదశి, అప్పారి వెంకటేశ్వరరావు, యింటి మహేంద్ర, అప్పన రామకృష్ణ, పెచ్చెట్టి విజయభాస్కరరావు, పెచ్చెట్టి నాగబాబు, కంచి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.