ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ (బుధవారం) ఢిల్లీలో సమావేశం అయిన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగాన్ని తగ్గించేందుకు.. అదే సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు ఒక ప్రత్యేక ప్రాజెక్టును ప్రకటించింది. నేషనల్ ఇండస్ట్రీయల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దేశంలోని 10 రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలను నిర్మించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా కొత్తగా 12 ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని అశ్వినీ వైష్ణవ్ వివరించారు. ఈ ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీల ద్వారా 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. కేంద్ర కేబినెట్ సమావేశం తర్వాత మాట్లాడిన అశ్వినీ వైష్ణవ్.. నేషనల్ ఇండస్ట్రీయల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద దేశంలో 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలను నిర్మించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 28,602 కోట్ల పెట్టుబడి పెడుతుందని వివరించారు.
తయారీ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు.. ఈ ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీలను నిర్మించాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ పారిశ్రామిక స్మార్ట్ సిటీల ద్వారా ప్రత్యక్షంగా 10 లక్షల మందికి.. పరోక్షంగా 30 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల సృష్టి జరుగుతుందని వివరించారు. రూ.1.52 లక్షల కోట్ల పెట్టుబడి సామర్థ్యం ఉందని.. ప్రపంచస్థాయి గ్రీన్ ఫీల్డ్ పారిశ్రామిక స్మార్ట్ సిటీలను ప్లగ్-ఎన్-ప్లే.. వాక్-టు-వర్క్ అనే కాన్సెప్ట్‌లతో నిర్మించనున్నట్లు తెలిపారు.
అమృత్‌సర్-కోల్‌కతా ఇండస్ట్రీయల్ కారిడార్.. ఢిల్లీ-ముంబై ఇండస్ట్రీయల్ కారిడార్.. వైజాగ్-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్.. హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్.. హైదరాబాద్-నాగ్‌పూర్ ఇండస్ట్రీయల్ కారిడార్.. చెన్నై-బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్‌లతో సహా 6 పారిశ్రామిక కారిడార్లలో ఈ ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను అమలు చేయనున్నట్లు అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ పారిశ్రామిక ప్రాంతాలు ఏపీలోని ఓర్వకల్, కొప్పర్తి.. తెలంగాణలోని జహీరాబాద్.. ఉత్తరాఖండ్‌లోని ఖుర్పియా.. పంజాబ్‌లోని రాజ్‌పురా-పాటియాలా.. మహారాష్ట్రలోని డిఘి.. కేరళలోని పాలక్కాడ్.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా, ప్రయాగ్‌రాజ్.. బీహార్‌లోని గయా.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్-పాలిలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.
ఇక ఈ ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుతో పాటు రూ.6456 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 296 కిలోమీటర్ల పొడవున్న 3 ప్రధాన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టులు.. దేశంలో రైలు కనెక్టివిటీని భారీగా మెరుగుపరచనున్నాయని కేంద్రం ప్రకటించింది. 2020లో రూ.1 లక్ష కోట్ల బడ్జెట్‌తో ప్రారంభించిన అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌ను విస్తరించేందుకు కేబినెట్ ఆమోదించింది. దీని ద్వారా ప్యాక్ హౌస్‌లు, కోల్డ్ స్టోరేజీ, రిఫ్రిజిరేటెడ్ వాహనాల, ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు సదుపాయాలకు కేంద్రం నిధులు అందించనుంది. ఈశాన్య రాష్ట్రాలలో 62 గిగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉన్న హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.4,136 కోట్ల ఈక్విటీ మద్దతును ప్రకటించింది.